Rain In Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఎస్ఆర్నగర్, మధురానగర్, పంజాగుట్ట, బషీర్‌బాగ్, అబిడ్స్, నారాయణగూడ, కోఠి పరిసరాల్లో ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అప్పటివరకు వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ ప్రజలను వాన చినుకులు పలకరించాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు కాస్తంత ఉపశమనం లభించింది.
రోడ్లపై వరదనీరు : నగర శివారు ప్రాంతం మణికొండలో కొద్ది పాటి వర్షానికే రోడ్డు అంత బురదమయంగా మారింది. సికింద్రాబాద్ పరిధిలోనూ వాన కురుస్తోంది. తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, ప్యారడైజ్‌లో చిరుజల్లులు పడుతున్నాయి. మలక్‌పేట, చంపాపేట్, సరూర్‌నగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. చంపాపేట్‌లో ఈదురుగాలి రావడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
వాహనదారులకు ఇబ్బంది : వివిధ పనులపై వెళ్తున్న వాహనదారులను వర్షం కాస్త ఇబ్బంది పెట్టింది. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, నాంపల్లి, లిబర్టీ, ట్యాంక్‌బండ్ తదితర రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.
ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రేపటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో మధ్యాహ్నం సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం - రహదారులన్నీ జలమయం - Rain in Hyderabad