Charlapally Railway Terminal Issue : చర్లపల్లి రైల్వే టెర్మినల్ రైల్వే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్‌తో మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే, దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా చర్లపల్లికి చేరుకోవాలంటే దగ్గరగా ఉంటే 40-45 నిమిషాలు, కాస్త దూరంగా ఉంటే గంట సమయం, ఇంకాస్త దూరంగా ఉంటే అంటే గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చేరుకోవాలంటే గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. రవాణా సదుపాయాలు ఉన్నా, ఆర్టీసీ బస్సులు మాత్రం నామమాత్రమే. ఆటో, క్యాబ్ ఎక్కితే వాడికి ఆస్తులు రాసినంత పని అవుతోంది.
ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన కృష్ణ సికింద్రాబాద్ స్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ దిగి చిలకలగూడలోని కుమారుడి ఇంటికి కేవలం ఐదు నిమిషాల్లో రూ.10 ఛార్జితో వెళ్లేవాడు. కానీ ఇప్పుడు రైలు నగరానికి రాకుండా చర్లపల్లి టెర్మినల్‌కే పరిమితం కావడంతో చిలకలగూడ వెళ్లేందుకు 40-45 నిమిషాలు సమయం పెరిగిపోయింది. ఆటో, క్యాబ్ ఖర్చులు అయితే రూ.250-రూ.300 వరకు అవుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అయితే ఆటో, క్యాబ్ ఖర్చు రూ.1000కి పైమాటే. పైగా వాయు కాలుష్యం విపరీతం. పిల్లలు, లగేజీతో వెళ్లేవారు, వచ్చేవారు ఆటోలు, క్యాబ్‌లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది.
చర్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరే రైళ్లు భువనగిరి, వరంగల్ వైపు వెళతాయి. దాదాపు 18 రైళ్లు బయల్దేరి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంటాయి. కేవలం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఆదిలాబాద్ నుంచి చర్లపల్లికి రైలు టికెట్ సెకండ్ సిటింగ్ రూ.175 కాగా, స్లీపర్ రూ.295. కానీ చర్లపల్లిలో దిగాక ఆటో, క్యాబ్‌లో చిలకలగూడ వెళ్లేందుకు రూ.300 వరకు ఖర్చు అవుతోంది. రాత్రిపూట అయితే వారు ఎంత ఛార్జీ అడుగుతారో చెప్పలేం.
ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకే చర్లపల్లి టెర్మినల్ : సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి నుంచి పలు రైళ్లను రైల్వే అధికారులు నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లు ఆ స్టేషన్ల ప్లాట్‌పారంపై 20-30 నిమిషాల వరకూ ఆగుతాయి. ఇక్కడ ఆ బండి కదిలిన తర్వాతే మరో బండి రావడానికి అవకాశం ఉంది. అందుకే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చారు. ఇక్కడ వరంగల్, ఏపీ వైపు వెళ్లే రైళ్లకు బదులుగా ముంబయి, పుణే, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపిస్తే ప్రయోజనం ఉండనుంది.
హుస్సేన్‌సాగర్, ముంబయి ఎక్స్‌ప్రెస్, పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లకు ఉపయోగిస్తే అక్కడ్నుంచి బయల్దేరే రైళ్లు సికింద్రాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లకు సమీపంలో ఉండేవారు సమీపంలోనే రైలు ఎక్కడానికి, దిగడానికి ఆస్కారం సైతం ఉండనుంది. మధ్యలో సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, కాచిగూడలో 2-5 నిమిషాలు ఆపితే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే ప్రధాన స్టేషన్‌పై గతంలో మాదిరి ఒత్తిడి అనేది ఉండదు.
ద.మ.రైల్వే జీఎంకు ఎంపీల విజ్ఞప్తులు : పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడపడం వల్ల సమస్యలు వస్తున్నాయని కొందరు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను గతంలో మాదిరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడిపించాలని కోరారు. ఆ రైలు సికింద్రాబాద్‌కు వెళ్లకపోవడం వల్ల అదిలాబాద్ నుంచి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారని వివరించగా, ఇదే తరహా సమస్యలను మరికొందరు ఎంపీలూ దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లారు.