PRIESTS SALARY HIKE IN AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 వేల పైగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ పెంపు కారణంగా ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుంది.
ఇందులో కొంత భాగాన్ని సీజీఎఫ్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఈ పెంపుతో పాటు మొత్తం లబ్ది పొందే అర్చకుల సంఖ్య 3 వేల 203. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో బ్రాహ్మణులు, అర్చకులు, వేద పండితులు, వేదాధ్యయనం చేసే విద్యార్ధులకు నిరుద్యోగ భృతి ద్వారా ప్రభుత్వం మేలు చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
వారందరికీ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి - ప్రభుత్వం ఉత్తర్వులు
Nirudyoga Bruthi For Vedic Scholars: మరోవైపు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సైతం కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వేదాధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయిస్తూ అక్టోబర్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు 3 వేల రూపాయల చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో మొత్తం 6 వందల మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. సింహాచలం, కనకదుర్గ ఆలయం, అన్నవరం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకాతిరుమల, కాణిపాకం ఆలయాల్లో వేదాధ్యయనం చేసిన పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేవాదాయశాఖ అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేల వేతనం-సీఎం చంద్రబాబు - CBN Review on Endowments Department