Precautions to be Taken to Prevent Thefts in Summer : సాధారణంగా ఎండాకాలంలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు సొత్తు ఎత్తుకెళ్తుంటారు. గతేడాది ఏప్రిల్ నెలలో జిల్లాలో ఓ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడింది. తాళం వేసిన ఇళ్లు, ఆరుబయట నిద్రించేవారిని లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దోచుకెళ్లింది. పోలీసులకే సవాలు విసిరిన ముఠా చివరికి జైలు పాలైంది. ఈ వేసవిలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ సూచిస్తోంది.
ఇటీవల జరిగిన సంఘటనలు :
- ఆలేరులో ఈ నెల 5న ఓ మహిళ ఉదయం వాకింగ్‌కు వెళుతుండగా దుండగుడు మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు.
- చౌటుప్పల్‌లో ఓ ఏటీఎం కేంద్రాన్ని కొల్లగొట్టి రూ.12 లక్షల నగదు దోచుకెళ్లారు.
- ఇటీవల చౌటుప్పల్ మండలంలోని పంతంగి, ఎస్ లింగోటం గ్రామాల్లో దేవాలయాల్లో హుండీలు పగులకొట్టి బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు.
- మోటకొండూరు, ఆత్మకూరు, భువనగిరి మండలాల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లలోని ఆయిల్, కాపర్ తీగలను ఎత్తుకెళ్లారు.
పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- కరుడుగట్టిన పాత నేరస్థులు, అంతర్ రాష్ట్ర ముఠాలపై పోలీసులు నిఘా పెంచాలి.
- జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టుల ఏర్పాటు, పెట్రోలింగ్ పెంచాలి.
- పదే పదే చోరీలకు పాల్పడే దొంగల కదలికలపై దృష్టి సారించాలి.
- రాత్రి వేళలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ బృందాలను మరింత పెంచాలి. సీసీ కెమెరాల పనితీరును సమీక్షించి మరమ్మతులు చేయించాలి.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- వేసవిలో ఆరు బయట నిద్రించేప్పుడు విలువైన బంగారు ఆభరణాలను వేసుకోవద్దు. బీరువాలకు తాళం వేసిన తాళం చెవి సురక్షితమైన ప్రాంతంలో దాచాలి.
- ఇంట్లో లేనప్పుడు విలువైన వస్తువులు సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. లేదా బ్యాంకు లాకర్లో పెట్టుకొవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంటి బాధ్యత నమ్మకస్తులకు అప్పగించాలి.
- రోజుల తరబడి ఊరికి వెళ్లాల్సివచ్చినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
- గ్రామాల్లో స్థానికుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. చోరీలు జరిగినా నిందితులను తొందరగా పట్టుకునేందుకు నిఘా నేత్రాలు దోహదపడతాయి.
ఈ దొంగల స్టైలే వేరు - బట్టల షాప్‌లే టార్గెట్‌గా చీరల చోరీలు - అనంతరం యాదగిరిగుట్ట దర్శనం
హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ - అడ్డొస్తే మారణాయుధాలతో దాడి