Gas Leakage Safety Tips in Telugu : ప్రమాదం ఎటు నుంచైనా రావొచ్చు. ఏ క్షణంలోనైనా జరగవచ్చు. దాని నుంచి తప్పించుకోవాలంటే అప్రమత్తత ఒక్కటే మార్గం. అయినా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తరచూ ఎక్కడో ఒకచోట గ్యాస్ సిలిండర్ల వల్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరి కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు.
- సోమవారం రాత్రి తల్లాడ మండలం మిట్టపల్లిలో వంట గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
- గతేడాది సత్తుపల్లి పురపాలిక పరిధిలోని హనుమాన్ నగర్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడటంతో భార్యభర్తలు మరణించారు.
లీకేజీకి ప్రధాన కారణాలు ఏంటంటే
- రెగ్యులేటర్‌ను సరిగ్గా బిగించకపోవటం లేదా దానిలోని ఓ-రింగ్ దెబ్బతినటం వల్ల గ్యాస్ లీక్ అవుతుంది. పాత లేదా నాసిరకం రెగ్యులేటర్‌ను ఉపయోగించటం.
- స్టవ్‌కు అనుసంధానించిన రబ్బర్ హోస్‌లో చీలికలు, రంధ్రాలు ఏర్పడటం
- స్టవ్‌లో నాబ్‌లు లేదా వాల్వ్‌లను సరిగ్గా మూసేయకపోవటం, బర్నర్‌లో అడ్డంకుల వల్ల గ్యాస్ లీక్ అయ్యె అవకాశముంది.
- అధిక వేడి, అగ్ని మూలాలకు దగ్గరగా సిలిండర్లను ఉంచటం వల్ల ఒత్తిడి పెరగటం.
- గ్యాస్ ఉపయోగించిన తర్వాత స్టవ్ నాబ్ లేదా రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయకపోవటం వల్ల ఒక్కొసారి గ్యాస్ లీకవుతుంది. సిలిండర్ రవాణా లేదా ఇన్‌స్టాలేషన్ సమయంలో ఏమరపాటుగా ఉండటం కూడా కారణమే
కలిగే దుష్పరిణామాలు
- ఎల్‌పీజీ అత్యంత దహనశీలమైనది. లీక్ అయిన గ్యాస్ అగ్ని మూలంతో కలవడం వల్ల పేలుడు సంభవిస్తుంది. ఇది ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది.
- లీక్ అయిన గ్యాస్(ప్రొపేన్, బ్యూటేన్) పీల్చుకోవటం వల్ల తలనొప్పి, మైకం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక గాఢతలో శ్వాస తీసుకుంటే ఊపిరాడకపోవటం, స్పృహ కోల్పోవటం లేదా మరణానికి దారితీయవచ్చు.
- గ్యాస్ అసంపూర్తిగా దహనం అయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది విషపూరితమైంది. ఆరోగ్య సమస్యలు, మెదడు దెబ్బతినటం వంటి వాటికి కారణమవుతుంది.
- గ్యాస్ లీకేజీ ఘటనలు కుటుంబ సభ్యుల్లో భయం, ఆందోళన, మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- గ్యాస్ లీక్ డిటెక్టర్(అలారం) అమర్చుకోవాలి. ఇది గ్యాస్ గాఢతను గుర్తించి అలారం సౌండ్ చేస్తుంది. దీన్ని వంటగదిలో సిలిండర్ సమీపంలో అమర్చుకోవాలి.
- ఆటోమేటిక్ గ్యాస్ షట్-ఆఫ్ వాల్‌ను సిలిండర్ రెగ్యులేటర్‌తో అనుసంధానించుకోవాలి. ఇది గ్యాస్ లీకయ్యే సమయంలో స్వయంచాలకంగా సరఫరాను నిలిపివేస్తుంది. అగ్ని, పేలుడు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- ఐఎస్‌ఐ మార్క్ కలిగిన రెగ్యులేటర్, హోస్‌లను ఉపయోగించాలి. ఇవి గ్యాస్ లీకయ్యే అవకాశాలను తగ్గిస్తాయి. వీటిని గడువు లోపు మార్చుతూ ఉండాలి.
గ్యాస్ లీకేజీ ఎక్కడ ఉందో గుర్తించాలని, వాసన ఎక్కడ వస్తుందో చూడాలని, ఒకవేళ గ్యాస్ వాసన వస్తే ఇంట్లోని కిటికీలు, తలుపులు తీసి ఉంచాలి ఖమ్మం జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి అజయ్‌కుమార్ సూచించారు. అవసరమైతే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వాలని తెలిపారు. గ్యాస్ పైపును సైతం ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని వివరించారు.
గ్యాస్ లీకై అగ్నిప్రమాదం - ఆరుగురికి తీవ్రగాయాలు - చికిత్స పొందుతూ?
గ్యాస్ సిలిండర్ లీకై మంటలొస్తున్నాయా? - ఇలా చేస్తే ప్రమాదాన్ని అరికట్టొచ్చు?