Praja Palana Dinotsavam Celebrations 2024 : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాలను ఎగురవేసి, అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఉద్యమసమయంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంగా ఈ వేడుకలు సాగాయి.
ఖమ్మం పోలీసు పరేడ్ మైదానంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమంతో ప్రారంభమైన నిజాం వ్యతిరేక ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగి ఆఖరికి తీవ్రరూపం దాల్చిందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఖమ్మం జిల్లాలో ఎందరో ప్రాణ త్యాగం చేసిన చరిత్ర ఉందని గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో భాగమైందన్నారు.
అనతికాలంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం : వరంగల్ జిల్లా ఐడీవోసీ మైదానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మువ్వెన్నెల జెండా ఎరగవేశారు. రాష్ట్ర ప్రజలు నయా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాపాలన తెచ్చుకున్నారని అన్నారు. హనుమకొండలో మంత్రి కొండా సురేఖ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
మహబూబాబాద్‌లోని కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి, గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఆదిలాబాద్‌లో ఘనంగా వేడుకలు : ఆదిలాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లిలో మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు.
కరీంనగర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి శ్రీధర్‌బాబు అంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనతికాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాగర్‌కర్నూల్ కలెక్టరెట్ కార్యాలయంలో జాతీయ జెండాను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ఎగరవేశారు.
అభివృద్ధి మార్గంలో ముందుంటూ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలనలో భాగంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆమ్రపాలితో కలిసి మేయర్ గద్వాల విజయ లక్ష్మీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన డీజీపీ జితేందర్ పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర జనసమితి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆచార్య కోదండరామ్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.