Ports Increase Export And Imports In Konaseema Districts: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జల రవాణాకు ఊపొచ్చింది. గతంతో పోలిస్తే పోర్టుల ద్వారా సరకు రవాణా పెరిగింది. కాకినాడ ప్రధాన కేంద్రంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాకినాడ యాంకరేజి పోర్టు ప్రైవేటు యాజమాన్యం ఆధీనంలోని కాకినాడ డీప్ వాటర్ పోర్టు (కాకినాడ సీ పోర్టు)లతోపాటు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రవ్వ పోర్టులో సైతం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చినట్లయితే 2024-25లో సరకు జల రవాణాకు సంబంధించి పెరుగుదల కనిపిస్తుంది.
దేశంలో అత్యధిక ఎగుమతులు, దిగుమతులు జరిగే పోర్టుల్లో ఉమ్మడి జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. యాంకరేజి పోర్టులో బియ్యం, సిమెంట్ సీ పోర్టు నుంచి బియ్యం, ఇతర ఆహార ఉత్పత్తులు, గ్రానైట్, చక్కెర, మత్స్య సంపద, సిమెంట్ క్లింకర్ ఇతర సరకులన్నీ ఎగుమతి అవుతాయి. బొగ్గు, ఎరువులు, అల్యూమినియం పొడి, పాస్ఫరిక్ యాసిడ్, ఎడిబుల్ ఆయిల్, ముడి చక్కెర దిగుమతి చేస్తారు. రవ్వ పోర్టు నుంచి క్రూడాయిల్ ఎగుమతి చేస్తారు.
పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం: ఏపీ మారిటైం బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ యాంకరేజి పోర్టు 40 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేస్తోంది. ఇక్కడ సౌకర్యాలతోపాటు సామర్థ్యం పెంచాల్సి ఉంది. కాకినాడ సీ పోర్టు 2 కోట్ల టన్నుల సామర్థ్యంతో పని చేస్తోంది. సరకు రవాణాకు అనువైన వనరులున్న ఇక్కడ గతంలో కంటెయినర్లలో బియ్యం ఎగుమతి చేస్తే తర్వాత క్రమంలో బస్తాల్లో బియ్యం ఎగుమతికి అవకాశం కల్పించారు.
లేటరైట్ ఇతరత్రా సరకు ఎగుమతులకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. పోర్టులను అనుసంధానం చేస్తూ భారత మాల ప్రాజెక్టు కింద రహదారులు, ఇతర వసతులు ప్రభుత్వం కల్పిస్తోంది. కొత్త మారిటైం విధానంతో పారిశ్రామికీకరణకు ఊతమిస్తోంది. దీంతో భవిష్యత్తులో జల రవాణాకు మరింత ఊపు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాకినాడ పోర్ట్, సెజ్ కేసు - ఈడీ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి
త్వరలోనే 'స్టెల్లా'కి మోక్షం - రేషన్ బియ్యం దించివేత ప్రారంభం