Polytechnic Courses in Telangana : ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఏ చిన్న ఉద్యోగానికైనా తీవ్రమైన పోటీ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏ కాలేజీలో ఎలాంటి కోర్సు చదివామన్నది అంత ముఖ్యం కాదు. ఎంత తొందరగా జీవితంలో స్థిరపడ్డామన్నదే ముఖ్యం. డిగ్రీలు, ఎంటెక్, పీజీలు, ఎంబీఏ సర్టిఫికెట్లు చేతపట్టుకుని పొట్ట కూటి కోసం వేలాది మంది నిరుద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. మరికొందరు ఉపాధి లభించకపోవడంతో కూలీ పని సైతం చేస్తున్నారు. చిన్న వయసులోనే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారికి త్వరగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాలిసెట్-2025 ఆన్లైన్ అప్లికేషన్ కొనసాగుతోంది.
ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగానే : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో వరంగల్ బాలురు, బాలికలకు వేరువేరుగా రెండు కళాశాలలు, కాటారం, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలున్నాయి. ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో 1,140 సీట్లు భర్తీ కానున్నాయి. ఎంట్రెన్స్ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. పాలిటెక్నిక్ కోర్సులో చేరడానికి దరఖాస్తు తేదీని ఈ నెల 19 వరకు తుది గుడువుగా నిర్ణయించారు. www.polycet.sbtet.telangana.gov.in అనే వైబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ అవకాశాలు : ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, సైన్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పాలిటెక్నిక్‌లో ఎంచుకున్న వివిధ కోర్సుల ఆధారంగా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా ఇరిగేషన్, రోడ్లు, భవనాల శాఖ, ఇంజినీరింగ్, టీఎస్‌ఆర్టీసీ, జెన్‌కో, విద్యుత్తు శాఖ తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి పోస్టులు దక్కించుకునే అవకాశం ఉంది. ఇదికాకుండా ఇంకా చదవాలనుంటే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి, నేరుగా బీటెక్‌లోనూ చేరవచ్చు.
కళాశాల | సీట్ల సంఖ్య |
కాటారం | 120 |
పరకాల | 120 |
స్టేషన్ ఘన్పూర్ | 120 |
వరంగల్ బాలుర | 540 |
వరంగల్ బాలికల | 240 |
"పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సు చదివిన వారికి బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరే అవకాశం కూడా ఉంటుంది. త్వరితగతిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారు" -డాక్టర్ ఎం.రాజ్‌కుమార్, ప్రిన్సిపల్, కాటారం
TS EAMCET 2023 addmission counselling schedule : వృత్తి విద్యాకోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
మానవ వనరులు అభివృద్ధి చేసే దిశగా.. ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలలు