Police Solved Major Theft Case Within 24 Hours : బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడి నుంచి 55 లక్షల 50 వేల రూపాయలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న ఇంకొల్లులోని వ్యాపారి జాగర్లమూడి శివప్రసాద్ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. నిందితుడు బీరువా తాళాలు పగులగొట్టి రూ.55లక్షల 50 వేల నగదు, 20 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు 24 గంటల్లో దొంగను పట్టుకున్నారు.
చంచల్ గూడ జైలులో స్నేహం : జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేలు మండలం అమిత్పురం బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ చంచల్ గూడ జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న ఇంకొల్లుకు చెందిన సాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పడే ఇద్దరు స్నేహితులయ్యారు.
అర్ధరాత్రి మెట్ల ద్వారా : జైలు నుంచి బయటకు వచ్చాక గతనెల మార్చి 30న సాయితో కలిసి మహమ్మద్ షరీఫ్ ఇంకొల్లు వచ్చాడు. ఇంకొల్లు గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానే వ్యాపారి శివప్రసాద్‌కు మూడంతస్తుల భవనం ఉంది. అతను శనగలు విక్రయించగా వచ్చిన నగదు, తాను నడిపే పాఠశాల విద్యార్థులు చెల్లించిన ఫీజుల మొత్తం రూ. 55 లక్షల 50 వేలు, అలాగే కుటుంబ సభ్యుల 24 సవర్ల బంగార ఆభరణాలు మూడవ అంతస్తుల భవనంలోని బీరువాలో ఉంచి తాళం వేశాడు. వ్యాపారి, కుటుంబసభ్యులు రెండో అంతస్తులులో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మహమ్మద్ షరీఫ్ ఇంటి వెనుక ఉన్న మెట్ల ద్వారా గోడపై నుంచి దూకి మూడవ అంతస్తులోకి వెళ్లాడు.
తెలంగాణలో 14 కేసులు : అనంతరం గది తాళంతో పాటు బీరువా తాళం పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. విషయం తెలుసుకున్న వ్యాపారి ఫిర్యాదు మేరకు ఇంకొల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. చివరికి 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ మహమ్మద్ షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నిందితుడు పై తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయని పలు నేరాల్లో జైలు శిక్ష అనుభవించాడని ఎస్పీ తెలిపారు. చోరీ కేసు ఛేదించి, సొత్తు రికవరీ చేసిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.
మొన్న నెల్లూరు - నిన్న కర్నూలు - రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు
చిత్తూరు జిల్లాలో దారి దోపిడీ - కత్తులతో బెదిరించి 3.7 కిలోల బంగారం చోరీ