Police Seized Ganja In Hyderabad : రాష్ట్రంలో గంజాయి అక్రమరవాణా కట్టడికి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఓచోట మత్తుపదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి గంజాయి కొనుగోలు చేసి రెండు కార్లలో యూపీ, ముంబయికి తరలిస్తుండగా నార్సింగి పోలీసులు రెక్కీ నిర్వహించి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 17వద్ద నిందితులను పట్టుకున్నారు. ఆ ముఠా నుంచి 254 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
రూ.89 లక్షల విలువైన గంజాయి స్వాధీనం : పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.89,09,000 ఉంటుందన్నారు. దీంతోపాటు రెండు కార్లను, రూ.3,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ చెప్పారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ సింగ్‌తోపాటు నదీమ్, సక్లైన్, సలీం, ప్రశాంత్ సింగ్‌లను అరెస్టు చేసినట్లు వివరించారు. ఇద్దరు యూపీకి చెందినవారు కాగా, మరో ముగ్గురు ముంబయికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.
సచిన్ సింగ్ అనే నిందితుడు ఒక పిస్టల్ వాడుతున్నాడని, అతని నుంచి పాయింట్ 32 కంట్రీమేడ్ వెపన్స్‌తోపాటు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల సరఫరాకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గంజాయి మాటే వినపించకూడదని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు.