Dr Prabhavati Police Inquiry : రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణకు హాజరైన గుంటూరు జీజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని పోలీసులు విచారించారు. ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రశ్నించారు. రఘురామకు గాయాలు ఉన్నప్పటికీ గాయాలు లేవని మెడికల్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? ఎవరి ప్రోద్భలంతో ఇవ్వాల్సి వచ్చింది? ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ప్రభావతిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సోమవారం నాడు ప్రభావతి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8:45 గంటల వరకు సాగిన విచారణలో పొడిపొడిగా ఆమె సమాధానాలు ఇచ్చారు. ఉదయం తన కుటుంబీకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ఎదుట ప్రభావతి మళ్లీ హాజరయ్యారు.
RRR Custodial Torture Case Updates : రఘురామకృష్ణరాజుకు సీఐడీ కస్టడీలో గాయాలపై వైద్య నివేదిక కోసం హైకోర్టు సూచనల మేరకు సదరు కమిటీలో సీనియర్ డాక్టర్లను నియమించాల్సి ఉండగా మీరెందుకు జూనియర్ వైద్యులకు స్థానం కల్పించారు? రఘురామను పరీక్షించడానికి కార్డియాలజిస్టును పంపించింది ఎవరు? ఏదైనా కేసులో ఎవరికైనా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలంటే మీరు పాటించాల్సిన మార్గదర్శకాలు ఏంటి? ఈ కేసులో అవన్నీ పాటించారా?
రఘురామపై గాయాలు ఉన్నప్పటికీ ఆయణ్ని కస్టడీలో సీఐడీ అధికారులు హింసించలేదని నివేదిక ఎలా ఇచ్చారు? మీరు సదరు రిపోర్ట్‌ను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే జారీ చేశారా? అటువంటి తప్పుడు నివేదిక ఇవ్వాలని మీపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? తదితర 20 ప్రశ్నలను దర్యాప్తు అధికారులు ప్రభావతిని అడిగారు. వాటికి ముక్తసరిగా స్పందించిన ప్రభావతి తనకు ఏమీ గుర్తులేవని, రికార్డులు చూస్తేనే చెప్పగలనని సమాధానం ఇచ్చారు. రాత్రి 8.45 గంటల సమయంలో విచారణ ముగిసింది.
కస్టోడియల్ టార్చర్ కేసులో సొంతంగా దర్యాప్తు - నిందితులను వదిలిపెట్టేది లేదు: రఘురామ