Kushaiguda Murder Case Update : హైదరాబాద్‌లోని కుషాయిగూడలో వృద్ధురాలిని హత్య చేసి మృతదేహాన్ని కాళ్లతో తొక్కుతూ వీడియో చిత్రీకరించిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృద్ధురాలిని హత్య చేసింది ఓ మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకు నిర్వహిస్తున్న హార్డ్‌వేర్ దుకాణంలో యువకుడు పనిచేస్తున్నట్లు తెలిపారు. దుకాణం యజమానితో పాటు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన కమలాచౌదరి కుటుంబం 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి కుషాయిగూడలో స్థిరపడ్డారు. అనారోగ్యంతో పదేళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. సంతానం లేకపోవడంతో కమలాచౌదరి ఒంటరిగానే జీవిస్తోంది. తన ఇంటి కింది పోర్షన్‌ను రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్ చౌదరి అనే వ్యక్తికి అద్దెకివ్వగా అందులో హార్ట్‌వేర్ దుకాణం నడుపుతున్నాడు. దుకాణంలో రాజస్థాన్‌కే చెందిన 17 ఏళ్ల యువకుడిని పనికి పెట్టుకున్నాడు. ఆ యువకుడే ఈనెల 11న కమలాచౌదరిని దారుణంగా హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.
వృద్ధురాలిని చంపేసి కాళ్లతో తొక్కుతూ : కమలాచౌదరితో కలివిడిగా ఉంటున్న యువకుడు ఈ నెల 11న ఆమె ఇంట్లోకి వెళ్లి ఆకలిగా ఉంది రోటీలు చెయ్యమని అడిగాడు. కమలాచౌదరి రోటీలు చేస్తున్న క్రమంలో వెనుక నుంచి ఇనుపరాడ్డుతో ఆమె తలపై కొట్టినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కిందపడిపోయి కొనఊపిరితో ఉన్న కమలాచౌదరి మెడకు చీరను బిగించి దానిని రాడ్‌కు చుట్టి తిప్పి హత్య చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు హత్యానంతరం మృతదేహాన్ని కాళ్లతో తొక్కుతూ వీడియో చిత్రీకరించి పైశాచికంగా ప్రవర్తించాడు. హత్య విషయం బయటికి పొక్కకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు యత్నించాడు. ఇంట్లోని వస్తువులన్నీ చిందవందరగా పడేసి యథావిథిగా తాను పనిచేసే హార్డ్‌వేర్ షాపులో విధులకు హాజరయ్యాడు.
ఆస్తి కోసమే హత్య చేశారా? : హత్యానంతరం బెంగళురులో ఉంటున్న తన స్నేహితుడికి కాల్‌చేసిన యువకుడు జరిగిన విషయం చెప్పాడు. అతను నమ్మకపోవడంతో మృతదేహంపై కాళ్లతో తొక్కుతూ తీసిన వీడియోను పంపించాడు. దీంతో హత్యోదంతం బయటపడింది. ఆ వీడియో హార్డ్‌వేర్ షాపు యజమాని ప్రకాశ్ చౌదరికి చేరడంతో అతను పోలీసులకు తెలియజేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కమలాచౌదరి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం రాజస్థాన్‌లోని ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కమలాచౌదరి మృతిపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన మైనర్ బాలుడితో పాటు హార్డ్‌వేర్ షాపు యజమాని ప్రకాశ్ చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని అంతం చేస్తే ఇళ్లు, ఆస్తిని సొంతం చేసుకోవచ్చనే ఆశతో హతమార్చారా! అనే కోణంలోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కారులో ఎక్కించుకొన్నాడు - నగలపై ఆశపుట్టి హత్య చేశాడు
వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ కేసు.. తెలిసిన వారే నిందితులు