Cricket Betting in Telangana : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ముచ్చట్లే. మాటలతో సరిపుచ్చితే బాగుండేది కానీ ఫలానా జట్టే గెలుస్తుందంటూ రూ.వేల నుంచి రూ.లక్షల్లో డబ్బులు బెట్టింగులు పెడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా విలువైన వస్తువులు కుదువపెట్టి, విపరీతంగా అప్పులు చేస్తున్నారు. యువతే ఐపీఎల్ బెట్టింగ్‌ల్లో ప్రధానంగా పాల్గొంటూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి సారించి బెట్టింగుల్లో కూరుకుపోకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
రహస్య నివాసాలు ఏర్పరచుకొని : పట్టణాల్లో కొంతమంది యువకులు శివారు ప్రాంతాలతో పాటు పట్టణం నడిబొడ్డున ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకొని, అక్కడే బెట్టింగులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్ నిర్వాహకుడికి ముందస్తుగా కొంత మేర డిపాజిట్ చేస్తూ, ఓడిపోతే వాగ్వాదాలు చేయకుండా రూల్స్‌ను పెట్టుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దున ఉండటం వల్ల జిల్లా కేంద్రంతో పాటు కోదాడ డివిజన్ పరిధిలో బెట్టింగుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా పలువురు చెబుతున్నారు. హైదరాబాద్‌తో మ్యాచ్ ఉన్న రోజు ఎక్కువ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ బెట్టింగ్‌ల వ్యవహారం పల్లెలకు కూడా చేరింది. అర్ధరాత్రి మ్యాచ్ ముగిసేంత వరకు యువత ఒక దగ్గరకు చేరి స్మార్ట్ఫోన్లలో, టీవీల్లో వీక్షిస్తూ బెట్టింగుల్లో పెడుతున్నారు. ఊరు బయట, ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో మ్యాచ్‌లు చూసే బ్యాచ్‌లు ఎక్కువైపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.
" బెట్టింగులకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. నగదు పందెం కాసి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దు. తమ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగులకు పాల్పడుతుంటే స్థానికులు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. క్షేత్రస్థాయిలో నిఘా పెంచి, బెట్టింగుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం"- శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ, కోదాడ
కలవర పెడుతున్న ఆన్‌లైన్ జూదం.. చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి?
ప్రాణం తీసిన ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ - రైలు కింద పడి యువకుడి దుర్మరణం