Police Caught Poker Players with Help of Drone : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు పదేపదే చెబుతున్నారు. చెప్పిన విధంగా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో వరదల సమయంలో డ్రోన్లను ఉపయోగించి బాధితులకు సేవలు అందజేశారు. డ్రోన్లను ఉపయోగించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. అందులో భాగంగానే పోలీసులు డ్రోన్లను ఉపయోగించే తీరుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
డ్రోన్ ద్వారా గుర్తించి అదుపులోకి : డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రంగం తాజాగా ఉండి పట్టణ శివారు నిర్మానుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న 9 మంది వక్తులను డ్రోన్ ద్వారా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని పట్టణ, గ్రామ శివారులో ఉండే నిర్మానుష్య ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట ఆడటం, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జూదం వంటి పలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకునేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా ఈ రోజు ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రోన్ ద్వారా గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కోలమూరు, పాందువ్వ గ్రామాల శివారు నిర్మానుష్య ప్రదేశాలలో పేకాట ఆడుతున్న వారిని గుర్తించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,390 నగదు స్వాధీనం చేసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు డ్రోన్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు చట్టాన్ని గౌరవించి ఈ తరహా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.