Police Arrested Rice Pulling Case Accused In Srikakulam District : అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాగి పాత్రను అక్షయ పాత్రగా నమ్మించి రైస్ పుల్లింగ్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ముఠాను సరుబుజ్జిలి పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ కేవీ రమణ ఆ కేసు వివరాలను వెల్లడించారు. రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన పి భద్రయ్య, విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన పి. రవి శంకర్లు కలిసి రాగి పాత్రను తయారు చేశారు.
అందులో అయస్కాంతాన్ని అమర్చి ఇనుప రజనుతో కృతిమ బియ్యాన్ని తయారు చేసి అది అక్షయ పాత్ర అని రైస్ పుల్లింగ్ అవుతుందని నమ్మించి మోసం చేయాలనుకున్నారు. పురాతన పాత్ర కావడంతో దాన్ని ఇంట్లో ఉంచుకుంటే రూ. కోట్లకు పడగ లెత్తుతారని ఇటీవల మధురవాడకు చెందిన రుద్రరాజు రంగరాజుకు మాయమాటలు చెప్పారు. ఆయనను సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస రహదారిలోని శిథిలావస్థకు చేరిన అతిథిగృహం వద్దకు రప్పించి రూ.25 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడ్డారు. ముందస్తుగా రూ.5 లక్షలు చెల్లిస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
పగలు కొత్తిమీర, కరివేపాకు విక్రయం- రాత్రి వేళ చోరీలు
గతంలోనూ ఓ కేసు : పట్టుబడినవారిని విచారించగా ముఠాలో మరో ఏడుగురు సభ్యులున్నట్లు గుర్తించారు. ఆ మేరకు జిల్లాకు చెందిన కిళ్లాం వాసి రఘునాథరావు, రాజు, భాస్కరరావుతో పాటు విశాఖ, తిరుపతి, హైదరాబాద్, కాకినాడ జిల్లాలకు చెందిన రౌతు కనకరాజు, మురళీకృష్ణ, శ్రీను, సత్యనారాయణలను అరెస్టు చేశారు. వారి నుంచి రాగి పాత్రతో పాటు కారు, ఆరు సెల్ఫోన్లు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై 2016లో కొత్తూరు పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైనట్లు ఏఎస్పీ వివరిం చారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఆమదావలస సీఐ పి. సత్యనారాయణ, సరుబుజ్జిలి ఎస్సై ఎస్. హైమావతి, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.