Police Arrested Fake IRS Officer in Nellore: ఓ నకిలీ ఐఆర్ఎస్ అధికారి పోలీసులకు పట్టబడిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ అధికారినంటూ రంగనాథస్వామి ఆలయానికి వచ్చిన వ్యక్తి కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ అధికారి బండారం బయటపడింది. కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా దొంగరంపూర్ ప్రాంతానికి చెందిన రాంపూర్ రమేష్ అనే వ్యక్తి ఐఆర్ఎస్ అధికారినంటూ ప్రజలను మోసగిస్తున్నట్లు నగర డీఎస్పీ సింధుప్రియ తెలిపారు.
భూ వివాదం పరిష్కరించేందుకు: నెల్లూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి భూ వివాదం పరిష్కరించేందుకు రమేష్ రూ. 2 లక్షలకు బేరం కుదుర్చుకుని నగరానికి వచ్చాడని డీఎస్పీ చెప్పారు. అయితే వెంకటరమణ అందుబాటులో లేకపోవడంతో రంగనాథస్వామి ఆలయానికి వెళ్లి ఐఆర్ఎస్ అధికారినని, తాను భూ వివాదాలు, ఆదాయపన్ను వ్యవహారాలు చూస్తుంటానని పరిచయం చేసుకున్నాడని తెలిపారు.
దీంతో దేవస్థానం భూ వివాదం గురించి ఈవో చెప్పడంతో, సంబంధించిన రిపోర్టుపై స్టాంపు వేసిన నకిలీ అధికారి, సాయంత్రం తనను కలవాలని చెప్పడంతో అనుమానం వచ్చిన ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సంతపేట పోలీసులు చాకచక్యంగా నకిలీ అధికారిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సింధుప్రియ తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ ఓఎస్డీ అంటూ మోసాలు - ఏపీ యువకుడి అరెస్ట్