Police Arrest Gang who Cheating in the Name of Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులు, నిరుద్యోగల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన ముఠాను విజయనగరం ఒకటో పట్టం పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
వాట్సప్ వేదికగా యువకులకు వల: విజయనగరానికి చెందిన సుజిత్, మరికొందరు, వాట్సప్ వేదికగా ఉద్యోగాల పేరుతో యువకులు, నిరుద్యోగులకు వల పన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ ద్వారా ప్రచారం చేపట్టారు. వీరి వలకు చిక్కిన నిరుద్యోగులు, యువకుల నుంచి అక్రమంగా డబ్భులు వసూలు చేశారు. ఇలా విజయనగరం ఉమ్మడి జిల్లాతో పాటు ఏలూరు, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నుంచి ఈ ముఠా 53 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
యువకుడు ఫిర్యాదుతో వెలుగులోకి మోసం: డబ్భులు చెల్లించిన వారికి నకిలీ ఐడి, నియామక పత్రాలు అందచేసి బురిడీ కొట్టించారని అసలు విషయం తెలుసుకున్న వినోద్ అనే యువకుడు ఫిర్యాదుతో ఈ ముఠా మోసం వెలుగు చూసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న వినోద్ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ముఠాలో నలుగురు సభ్యులను అరెస్టు చేశామని అన్నారు.
ముఠా సభ్యుల్లో మహేష్, గుంటూరు జాన్, రూబిన్, యాకుబ్ అనే నిందితులను అరెస్టు చేసి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు సుజిత్‌తో పాటు, పరారీలో ఉన్న మిగిలిన నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించినందుకు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇలా దొరికారు: ముఠాలో కీలక నిందితుడైన సుజిత్‌కు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు మిగతా నిందితులు విజయనగరం వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు.