మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు - దొరికితే పాతికేళ్లదాకా లైసెన్సు ఉండదు
మూడు నెలల్లో 5,040 మైనర్ డ్రైవింగ్ కేసులు - ప్రమాదాలను అరికట్టడంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల పాత్రే కీలకం - హైదరాబాద్‌లోని పలు పాఠశాల విద్యార్థులు బైక్‌ల పైనే రాకపోకలు

Published : July 14, 2025 at 4:54 PM IST
Strict Action on Accidents Caused by Minors Driving : పదో తరగతి చదివే ఓ విద్యార్థి సోదరిని కూర్చోబెట్టుకుని బైక్ నడుపుతుండగా అదుపుతప్పి పడిపోయింది. సోదరి తీవ్ర గాయాలతో మృతిచెందింది. డ్రైవింగ్ చేసిన మైనర్‌పై కేసు నమోదైంది. మరో ఘటనలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి తన తండ్రిని వెనుక ఎక్కించుకుని బైక్ నడుపుతున్నాడు. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో తండ్రి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ఘటనల్లో మైనర్లు కేసుల్లో ఇరుక్కున్నారు.
వరుస ఘటనల కారణంగా ట్రాఫిక్ పోలీసులు మైనర్ల డ్రైవింగ్ కట్టడికి చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పర్యవేక్షణలో తనిఖీలు చేపడుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి జూన్ నెలాఖరు వరకు 5,040 కేసులు నమోదు చేశారు.
చిన్నప్పటి నుంచే నడుపుతున్నాడనే ధీమా : కాస్త దూరమే అయినా ఏం కాదులే అనుకుని చిన్నప్పటి నుంచే బైక్, కారు నడుపుతున్నాడనే ధీమాతో పోలీసులు పట్టుకున్నా జరిమానా కడితే సరిపోతుందిలే అనే ఆలోచనతో ఇలా తల్లిదండ్రులు తమకు తామే సర్దిచెప్పుకుని పిల్లల చేతికి వాహనం ఇవ్వటం సర్వసాధారణంగా మారింది. కన్నవారిని ఏమార్చి బండి తీసుకెళ్తున్న పిల్లలూ ఉన్నారు.
వాహనాలను బహుమతిగా ఇస్తున్న తల్లిదండ్రులు : పిల్లల ఒత్తిడి భరించలేక తల్లిదండ్రులే వాహనాలను బహుమతిగా ఇస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రైవేట్ విద్యాసంస్థల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు చాలామంది బైక్‌ల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. బంజారాహిల్స్, హబ్సిగూడ, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట్, టోలిచౌకి ప్రాంతాల్లోని పాఠశాలలకు 1-2 శాతం మంది బైకులపైనే వస్తున్నారని పోలీసులు గుర్తించారు. పాఠశాల బస్సులు, ఆటోలకు భారీగా రుసుం చెల్లించే కంటే బండి కొనిస్తే చాలని భావించటమే ఇందుకు కారణం.
25 ఏళ్ల వరకూ లైసెన్స్ ఉండదు : మైనర్ల డ్రైవింగ్‌తో జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహన యజమానులు, తల్లిదండ్రులు, సంరక్షకులపై కేసులు నమోదు చేస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులకు 3 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 12 నెలల పాటు ఆర్సీ రద్దు చేస్తారు. వాహన రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేయిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేసి పోలీసులకు చిక్కితే 25 ఏళ్ల వయసు వచ్చేంత వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం అందిస్తున్నారు.
సరైన నిర్ణయం తీసుకోలేరు : పాఠశాల స్థాయి విద్యార్థులు ద్విచక్రవానాలపై వస్తే యాజమాన్యం లోపలికి అనుమతించకూడదని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు. అకస్మాత్తుగా వాహనాలు ఎదురైనా, పక్కకు తప్పుకోవాల్సి వచ్చినా మైనర్లు షాక్‌లో గందరగోళానికి గురై సరైన నిర్ణయం తీసుకోలేరని ఆయన తెలిపారు. అతివేగం, జిగ్‌జాగ్ డ్రైవింగ్‌తో బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదాలబారిన పడతారని చెబుతున్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరిస్తేనే మైనర్ల డ్రైవింగ్ ప్రమాదాలను అరికట్టవచ్చు అని ఆయన వివరించారు.
గత మూడు నెలల్లో :
అంశం మైనర్ల డ్రైవింగ్
కేసులు 5,040
సామాజిక సేవ 3,088
జరిమానాలు రూ.41,33,850
రిజిస్ట్రేషన్ రద్దు 863
సండే హెచ్చరిక : సినిమా హీరోల్లా మైనర్ల డ్రైవింగ్ - రోడ్డు మీద తొక్కేసిపోతున్న లారీలు! - ఇవి చేయకండి
ఓనర్లు! మైనర్లకు వాహనం ఇస్తున్నారా? - అయితే మీ వాహన రిజిస్ట్రేషన్ రద్దే

