Polavaram Project Work Will Continue During Flood: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలంటే ప్రస్తుతం వర్షాకాలంలో, వరదల సమయంలో ఎదుర్కోవడమే అసలైన సవాలుగా మారింది. అందువల్ల వరదల సమయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పనులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది చివరికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేసి, నవంబరు నుంచి సమాంతరంగా ప్రధాన డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ ఏడాది చివరికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయాలంటే వరదల సమయంలోనూ పనులు చేయాల్సి ఉంటుంది. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల ప్లాన్‌ను వరదలు, వర్షాకాలం కారణంగా ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొనే ప్లానే చేయాలి.
గోదావరిలో ఏటా భారీ వరదలు సంభవిస్తాయి. 15 లక్షల నుంచి 26 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఒకేరోజు వరద ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. జులై నుంచి దాదాపు నవంబరు మధ్య దాదాపు 100 రోజుల పాటు అత్యధికంగా వరద ప్రవహిస్తూ ఉంటుంది. పైగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున సీపేజీ నీళ్లు వచ్చి డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలోనూ, ప్రధాన డ్యాం వద్ద చేరుతుంటాయి. దీంతో అక్కడ నీరు నిండి పనులు చేయడం కష్టమవుతోంది. ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోయాలి. కొంతవరకు నీటి స్థాయి నిర్వహిస్తూ పనులు చేసుకునేలా ప్లాన్ రూపొందించారు.
ఇదీ డయాఫ్రం వాల్ ప్లాన్: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణంలో అంతర్భాగంగా డయాఫ్రం వాల్‌ను కట్ ఆఫ్ వాల్ (ఊట నియంత్రణ గోడ)గా నిర్మిస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో కొన్నిచోట్ల 90 మీటర్ల లోతు వరకు వెళ్లి అక్కడ రాయిలోకి ప్లాస్టిక్ కాంక్రీటు ప్యానళ్లు ఏర్పాటుచేసి ఈ వాల్‌ని నిర్మిస్తున్నారు. డయాఫ్రం వాల్ పొడవు 89 నుంచి 1,485 మీటర్ల వరకూ ఉంటుంది.
వరదలకు ముందు: 430 - 890 మీటర్ల మధ్య నిర్మాణాన్ని వరదలకు ముందే పూర్తి చేయనున్నారు. మొత్తం 28,000 చదరపు మీటర్ల మేర ప్లాస్టిక్ కాంక్రీటు పనులు చేస్తారు. ఈ భాగం గోదావరి నది మధ్యలో ఉంటుంది. వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 13 వేల చదరపు మీటర్ల పని పూర్తి చేశారు.
వరదల సమయంలో: జులై నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి ఆ చివర, ఈ చివర భాగాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. 89 నుంచి 220 మీటర్ల వరకు 5,600 చదరపు మీటర్లు, అదే విధంగా 1,070 నుంచి 1,485 మీటర్ల వరకు 12 వేల చదరపు మీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తారు.
వరదలు తగ్గాక ఇలా: వరదలు తగ్గాక 220-430 మీటర్లు, 900 నుంచి 1,070 మీటర్ల వరకు ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
22 మీటర్ల ఎత్తున ప్లాట్ ఫాం నిర్మాణం: డయాఫ్రం వాల్ నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు వద్ద 20 మీటర్ల ఎత్తున 1,400 మీటర్ల మేర ప్లాట్‌ఫాం నిర్మించారు. దానిపై యంత్రసామగ్రి ఉంచి ప్యానళ్లు దింపి ప్లాస్టిక్ కాంక్రీటు నింపి డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజీ నీటిని 19 మీటర్ల స్థాయికి నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వరదల సమయంలో పనులు చేసేందుకు వీలుగా ప్లాట్‌ఫాం ఎత్తును 22 మీటర్లకు పెంచారు. అదే సమయంలో అక్కడ నీటిమట్టం 19 మీటర్లు ఉండేలా నీటిని ఎత్తిపోస్తూ ఉండాలి. ఒకవైపు నదిలో వరద ప్రవహిస్తున్నా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులకు ఆగకుంటా చేయాలని చూస్తున్నారు.
బట్రస్ డ్యాం నిర్మాణం కొలిక్కి: పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి ఏడేళ్లు అవుతోంది. ఈ డ్యాం జీవితకాలం 5 ఏళ్లుగా అంచనా. ఎగువ కాఫర్ డ్యాం సామర్థ్యం ఎలా ఉందో విదేశీ నిపుణుల బృందం ఇప్పటికే పరిశీలించింది. ఎగువ కాఫర్ డ్యాం గట్టితనం కోసం బట్రస్ డ్యాం నిర్మించాలని సూచించారు. ఎగువ కాఫర్ డ్యాం దిగువన దీనిని నిర్మిస్తున్నారు. మొత్తం 7.62 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు దాదాపు 6 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. జూన్ నెలాఖరుకు బట్రస్ డ్యాం నిర్మాణం కొలిక్కి రానుంది.
48 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల ముందు వరకు స్పిల్‌వే దిగువన ఉన్న రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా ప్రవాహం వెళ్లేది. 7వ తేదీకి పోలవరం నీటిమట్టం క్రస్టుగేట్ల స్థాయి 25.72 మీటర్లు దాటి 25.95 మీటర్లకు చేరుకుంది. దీంతో స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 10,000 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులో ముందడుగు - కేంద్ర జలసంఘానికి ప్రి ఫీజిబిలిటీ నివేదిక
పోలవరం ప్రాజెక్టు అప్డేట్స్ - మీనియేచర్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు