Polavaram Project Main Dam Works : పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన రాయి, వివిధ స్థాయిల (గ్రేడేషన్లు) నల్లమట్టి, ఇసుక, ఇతర ఫిల్టర్ల కోసం వినియోగించే సామగ్రిపై (మెటీరియల్) అన్వేషిస్తున్నారు. ఒకవైపు గ్యాప్-1 ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సన్నద్ధమయ్యారు. మరోవైపు డయాఫ్రం వాల్‌ను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ఈ ఏడాది నవంబర్ నుంచి సమాంతరంగా గ్యాప్-2 ప్రధాన డ్యాం పనులు చేపట్టాలన్నది వ్యూహం.
ఈ రెండింటికీ పెద్ద ఎత్తున రాయి, నల్లమట్టి, ఇసుక అవసరం. ప్రధాన డ్యాం 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాలి. గ్యాప్ 1 డ్యాం 540 మీటర్లు, గ్యాప్ 2 డ్యాం 1,750 మీటర్ల పొడవున 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. ప్రస్తుతం గ్యాప్-1 డ్యాం డిజైన్లు కొలిక్కి వస్తుండగా, దీనికి అవసరమైన సామగ్రి అందుబాటులోనే ఉంది. గ్యాప్-2 డ్యాంకు ఉన్న మెటీరియల్ ఎంత? ఇంకా ఎంత అవసరమనే అంశాలను లెక్కిస్తున్నారు.
Polavaram Project Updates : ప్రధాన డ్యాం నిర్మాణంలో డయాఫ్రం వాల్ పైనుంచి నల్లమట్టితో కొంత ఎత్తు వరకు మట్టికట్ట నిర్మిస్తారు. దిగువన ఏడు మీటర్ల వెడల్పు నుంచి పైకి వెళ్లే కొలదీ ఐదు మీటర్ల వెడల్పు ఉండేలా ఏటవాలుగా ఈ నిర్మాణం ఉంటుంది. దీనికి ఆనుకొని ఇసుక, ఇతర ఫిల్టర్లు ఉంటాయి. దీని కోసం రాయి, నీటిని అడ్డుకునే గుణం ఉండే వివిధ గ్రేడుల నల్ల మట్టిని వినియోగిస్తారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఒకప్పుడు అన్నీ కొండలే ఉండేవి. నదీ గర్భం అనువుగా లేని కారణంగా పక్కన ఉన్న కొండల్ని తొలిచి, ఊళ్లను ఖాళీ చేయించి స్పిల్‌వేను నిర్మించారు. ఆ కొండల్లో నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాయి తొలగించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోశారు. దాన్ని పరిశీలించి ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎంత మేర అందుబాటులో ఉంది? ఇంకా ఎంత వరకు సేకరించాల్సి ఉంటుందో లెక్కలను సిద్ధం చేశారు.
వివిధ స్థాయిలు (గ్రేడేషన్లు) కలిగిన నల్లమట్టిని ఈ నిర్మాణంలో వినియోగిస్తారు. సీఐ, సీఎల్ రకం 5,00,000 క్యూబిక్ మీటర్లు, సీహెచ్ రకం 6,74,073 క్యూబిక్ మీటర్లు, ఎస్‌ఎం,ఎస్‌సీ రకం 12,23,787 క్యూబిక్ మీటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా దాదాపు 13,25,057 క్యూబిక్ మీటర్ల మేర నల్లమట్టి అవసరమని నిపుణులు తెలిపారు. పోలవరం ఎగువన కొండ పోచమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో గతంలో సేకరించిన భూముల్లో ఈ రకం మట్టి ఉన్న 10 ప్రదేశాలను గుర్తించారు.
అదనపు వ్యయంపై చర్చ : ఆ మట్టిని ఎంతదూరం నుంచి తీసుకురావాల్సి ఉంటుంది? రవాణాకు ఎంత ఖర్చవుతుంది? తదితర వ్యయాలతో కొత్తగా అంచనాలు రూపొందిస్తున్నారని సమాచారం. దీనివల్ల అదనపు వ్యయం తప్పదా అనే చర్చ సాగుతోంది. వీటికి సంబంధించి లెక్కలు సిద్ధం చేయలేదని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు మొత్తం దాదాపు 87.52 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అవసరమని నిపుణుల బృందం లెక్కించింది. ప్రస్తుతం 48.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రాయిని నిల్వ చేసి ఉంచారు. దీనికి ఇంకా దాదాపు 39.11 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అవసరం పడుతుందని తెలుస్తోంది. ఇందుకోసం ప్రాజెక్టు వద్ద ఉన్న 902 కొండలను తవ్వి సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.