Polavaram Left Canal Works Progressing Rapidly: 5 ఏళ్ల విరామం తరవాత పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని గవరపేట, తాళ్లూరు, రేఖవానిపాలెం గ్రామాల సమీపంలో పెద్ద పెద్ద కొండలను తొలగించి కాలువ నిర్మాణ పనులు చేపట్టడం అధికారులకు సవాలుగా మారింది.
తుని మండల పరిధిలోని సుమారు 18 కి.మీ. పొడవునా కాలువ నిర్మించాల్సి ఉంది. గత టీడీపీ పాలనలో కాలువ నిర్మాణంలో మట్టి పనులు సుమారు 11 కి.మీ., సీసీ లైనింగ్ పనులు 10 కి.మీ. వరకు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణ పనులను జూన్ చివరికి పూర్తిచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది.
రాయి, మట్టి తొలగిస్తేనే: తుని పరిధిలోని తాళ్లూరు, కుమ్మరిలోవ, రేఖవానిపాలెం సమీపంలో కాలువ నిర్మాణం పనులకు కొండలను తొలగించాల్సి ఉంది. గతంలో గవరపేట వద్ద కొండను చీల్చుతూ కాలువ నిర్మాణ పనులు 90 శాతం పూర్తి చేశారు. అదే మాదిరి కుమ్మరిలోవ, తాళ్లూరు సమీపంలో పెద్ద కొండను తొలగించి కాలువ నిర్మాణం చేపట్టాల్సిఉంది. దీని కోసం సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి, మట్టిని తొలగించాలి.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ - జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
పేలుళ్ల మోతకు ఇళ్లు బీటలు: దీంతో కొండలను పిండిచేస్తూ రాళ్లను తొలగించేందుకు చేపట్టిన పనుల మధ్య బాంబుల మోతతో ఈ ప్రాంతం మార్మోగిపోతుంది. అయితే సమీపంలోని జనావాసాలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడంతోపాటు బాంబులు పేల్చే సమయాన్ని సైతం వారికి తెలియజేస్తూ పనులు చేపడుతున్నారు. దీంతో ఇటీవల కుమ్మరిలోవ ప్రాంతవాసుల ఇళ్లు పేలుళ్ల మోతకు బీటలు వస్తున్నాయి. ఈ సమీపంలో అండర్‌బ్లాస్టింగ్ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం విశేషం.
దీంతోపాటు చేపూరు, మర్లపాడు, తాళ్లూరు, రేఖవానిపాలెం సమీపంలో సీసీ లైనింగ్ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మరో పక్క తాండవ నదిపై అక్విడక్టు నిర్మాణంలో కాంక్రీట్ పనులు చేపట్టామని ఈఈ గోవింద్ తెలిపారు. ఇదే రీతిన పనులు కొనసాగితే ఆగస్టు నాటికల్లా పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణం ఈ ప్రాంతంలో పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు.
పోలవరంలో మరో కీలక అడుగు - గ్యాప్-1 రాక్‌ఫిల్ డ్యామ్ పనులకు శ్రీకారం