PM Surya Ghar Muft Bijli Yojana : కరెంట్ బిల్లు ఖర్చు భారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసరా కానున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకాన్ని ఉపయోగించుకుంటే ఏకంగా 25 సంవత్సరాల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రయోజనం పొందొచ్చు.
ప్రతి ఇంటా బడ్జెట్‌లో విద్యుత్ బిల్లు పద్దు నెలనెలా పెరుగుతోంది. డిస్కంలు వేసే అదనపు భారాలు సరేసరి. దీంతో మధ్యతరగతి కుటుంబానికి వచ్చే బిల్లు ప్రతి నెలా రూ.1000కి తగ్గడం లేదు. అలాంటిది 25 సంవత్సరాల పాటు పైసా కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. కానీ పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన దీన్ని సాకారం చేస్తోంది. ఏపీలో ప్రస్తుతం 20 లక్షల వినియోగదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలనూ ఇస్తున్నాయి. ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్‌కు మించి వాడినా నెట్ మీటరింగ్ విధానంలో బిల్లును లెక్కిస్తారు. ఫలితంగా పెద్దగా భారం పడదని అధికారులు పేర్కొంటున్నారు.
PM Surya Ghar Scheme : నెలలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల వినియోగదారుల విద్యుత్ వినియోగం 225 యూనిట్లలోపే ఉంటుంది. ఇళ్లపై 2 కిలోవాట్ల సౌర ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటే ఛార్జీల భారాన్ని తప్పించుకోవచ్చు. రెండు కిలోవాట్ల సౌరప్రాజెక్టుతో నెలకు 200 నుంచి 240 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని అంచనా. కరెంట్ వినియోగం ఆ లోపునే ఉంటే ఛార్జీలను చెల్లించాల్సిన అవసరమే లేదు. మిగులు ఉన్నట్లయితే యూనిట్ విద్యుత్‌ను 2 రూపాయల 9 పైసల చొప్పున డిస్కంలే కొంటాయి. విద్యుదుత్పత్తికి మించి వినియోగిస్తే అదనపు మొత్తానికి టారిఫ్ ప్రకారం డిస్కం బిల్లు వసూలు చేస్తుంది. ప్యానల్ జీవితకాలం 25 సంవత్సరాలు కాబట్టి తగిన విధంగా వాడుకుంటే కరెంట్ బిల్లు కట్టే అవసరమే ఉండదు.
ఒక విద్యుత్ వినియోగదారుడు రెండు కిలోవాట్ల సౌర ప్రాజెక్టు ఏర్పాటుచేసుకుంటే ఆ నెలలో 200 యూనిట్ల కరెంట్ మాత్రమే వస్తే వాడకం 250 యూనిట్ల వరకూ ఉంటే ఉత్పత్తి చేసిన విద్యుత్ కన్నా అదనంగా 50 యూనిట్లు వినియోగించినట్లవుతుంది. ఆ కరెంట్‌కు డిస్కంల టారిఫ్ ప్రకారం రూ.117 చెల్లిస్తే సరిపోతుంది. మూడు డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు కలిపి సుమారు 2.02 కోట్లున్నాయి. వాటిలో గృహ కనెక్షన్లు 1.56 కోట్లు.
అందరికీ ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటుంది. పీఎం సూర్యఘర్ కింద 2027 మార్చినాటికి 20 లక్షల ఇళ్లపై ఒక్కోచోట రెండు కిలోవాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టుల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం. వాటి ద్వారా సుమారు 4000ల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 2 కిలోవాట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే రాయితీ రూ.60,000లు కాగా బీసీలకు అదనంగా మరో రూ.20,000లు రాష్ట్ర ప్రభుత్వం రాయితీనిస్తుంది. అంటే బీసీ వాడకందారులకు రూ.30,000లతోనే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఆ మొత్తాన్నీ బ్యాంకు రుణంగా పొందొచ్చు.
డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ - తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు
ఉత్తరాంధ్రకు సీమ పవర్ - గ్రీన్ ఎనర్జీ కారిడార్‌పై ప్రభుత్వం ఫోకస్