People Facing Problems with Lack of Transportation : నాటు పడవలపైనే రోజూ ఆ గ్రామస్థుల ప్రయాణం. రైతులు పొలం పనులు చేసుకోవాలన్నా, ప్రజలు జీవన అవసరాలు తీర్చుకోవాలన్నా నది దాటాల్సిందే. ఇక అత్యవసర పరిస్థితుల్లో అయితే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిందే. సాహసించి ప్రయాణం చేసినా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని దుస్థితి.
కృష్ణా జిల్లా ఎదురుమొండి పంచాయతీలోని 7 గ్రామాలు రేపల్లె మండలంలోని నది పరివాహక ప్రజలు దశాబ్దాలుగా సరైన రవాణా మార్గం లేక నిత్యం నదిపై ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. తమ సమస్యకు ఏ ప్రభుత్వమైనా పరిష్కార మార్గం చూపకపోదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కృష్ణా నదికి ఓవైపు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం, మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు నది పరివాహక గ్రామాలు ఉన్నాయి.
ఈ ప్రాంతాల మధ్య సరైన రవాణా సౌకర్యం లేక గ్రామస్థులు అగచాట్లు పడుతున్నారు. కృష్ణా జిల్లా ఎదురుమొండి పంచాయతీలోని 7 గ్రామాలు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలకు పడవ ప్రయాణం ఒక్కటే ఆధారం. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో ఎదురుమొండి పంచాయతీకి చెందిన వారికి భూములు ఉన్నాయి. అలానే ఆ ప్రాంతంలోని వారికి ఇక్కడ భూములున్నాయి.
రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు తమ పనులు కోసం నిత్యం ఏటినావ పైనే పయనించాలి. ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నప్పటికీ బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఆ గ్రామస్థులది. గత్యంతరం లేక ఆడవాళ్లు, పిల్లలతో భయపడుతూ నది దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ఏ చిన్న అవసరం వచ్చినా నది దాటి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేవలం ఒక్క ఏటినావ మాత్రమే గ్రామస్థులను అటూఇటూ చేరవేస్తోంది. ఇక భారీ వర్షాలు, నదిలో వరద ఉద్ధృతి సమయంలో ఆ నావ కూడా ఎటూ కదల్లేని పరిస్థితి. ఈ గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, అస్వస్థతకు గురైనా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. తమ సమస్యకు వంతెన నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గం' - ప్రాంతవాసులు
వాగులో మృతదేహాన్ని మోసుకెళ్లిన గ్రామస్థులు - అసలేం జరిగిందంటే? - Paderu Bridge problem in Ap
గతంలో నది దాటుతూ జరిగిన ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇప్పటికీ తమ కళ్ల ముందే కదలాడుతున్నాయని వాపోతున్నారు. వంతెన నిర్మాణంతో దశాబ్దాలుగా ఉన్న తమ సమస్య తీరిపోతుందని పిల్లల చదువులు, రోజువారి అవసరాలకు ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పార్టీ ఓట్లు కోసం వాగ్దానాలు చేస్తున్నారే తప్పా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'రోడ్డు మంజూరైనా ప్రారంభం కాని పనులు' - డోలీలతో గిరిజనుల ఆందోళన