People Searching for Diamonds at Vajrakarur of Anantapur District: ఈ ప్రాంతంలో వర్షాలు పడితే చాలు చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా వేట మొదలుపెడతారు. అది మామూలు వేట కాదు వజ్రాల వేట. అవును మీరు విన్నది నిజమే! ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరులో ప్రజలందరూ ఈ వేటలోనే నిమగ్నమైపోయారు.
వజ్రకరూరులో వజ్రాల వేట షురూ: అనంతపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతంలో వర్షం తమకు అదృష్టం తీసుకొస్తుందా లేదా అని స్థానిక ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటారు. వర్షం పడితే చాలు అక్కడ చిన్నా పెద్దా తేడా లేకుండా వజ్రాల వేటలో నిమగ్నమైపోతారు. వర్షాలు పడి భూమిపై ఉన్న వజ్రాలు బయట పడతాయని ఏటా వర్షాకాలంలో వజ్రకరూరుతో పాటు చుట్టు పక్కల ప్రజలూ పొలాల్లో అన్వేషణ ప్రారంభిస్తారు.
ఒక్క వజ్రం దొరికినా జన్మ ధన్యమే అనుకుంటూ పొలాల్లో వెతుకులాట ప్రారంభిస్తారంటే అతిశయోక్తి కాదు. తమ అదృష్టం పరీక్షించుకోవటం కోసం కుటుంబంతో సహా వచ్చి వెతికేవారు కొందరైతే ఏకంగా పొలాలకు భోజనం క్యారేజీలతో వచ్చే వారు మరికొందరు కావడం గమనార్హం. బైక్లు, ఆటోలు, కార్లలో వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.
వజ్రాల కోసం తరలివస్తున్న ప్రజలు: గత ఐదు రోజులుగా వర్షం కురుస్తుడడంతో ఉమ్మడి జిల్లాతో పాటు కర్నూలు, బళ్లారి, హైదరాబాద్, గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు చేరుకుని పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. వర్షాలు పడే కొద్దీ వజ్రాలు వెతకడానికి వచ్చే వారి సంఖ్య మరింత పెరగనుంది.
సెలవులు కావటంతో వజ్రకరూరు కళకళల్లాడుతోంది. ఒక్క వజ్రం దొరికినా అన్ని కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ ప్రాంతాల వారు వజ్రాల కోసం వెతకుతూనే ఉన్నారు. రెండు రోజుల కిందట అక్కడ ఇద్దరికీ వజ్రాలు దొరికినట్లు ప్రచారం సాగుతోంది.
''వర్షం తమకు అదృష్టం తీసుకొస్తుందా లేదా అని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మా ప్రాంతంలోని ఓ వ్యక్తికి కొన్ని వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాలను అతను కొంత మొత్తం నగదుకు విక్రయించారు. అదే విధంగా మాకు సైతం ఏమైనా వజ్రాలు దొరుకుతాయేమోనని వెతుకుతున్నాం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి వెతికేవారు కూడా ఉన్నారు. వారు అన్ని పనులు మానుకుని భోజన క్యారేజీలు కట్టుకుని మరీ వజ్రాల వేటకు పొలాలకు వస్తారు'' -స్థానికులు, వజ్రకరూరు
వజ్రకరూరులో నీటి సంక్షోభం - పరిష్కారం కోసం రోడ్డెక్కిన మహిళలు - Women Protest highway
Clash Between Two Groups of YCP: వజ్రకరూరు వైసీపీలో ఇరువర్గాల ఘర్షణ.. 25 మందిపై కేసు నమోదు