PENSION DISTRIBUTION ONE DAY BEFORE: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను నగదును పెంచడంతో పాటు పంపిణీలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీన నగదు అందిస్తూ వారి కళ్లలో ఆనందం నింపుతోంది. 1వ తేదీన ఆదివారం లేదా సెలవు వస్తే, అటు లబ్ధిదారులతో పాటు ఇటు ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఒక రోజు ముందుగానే అందిస్తోంది. అందులో భాగంగా జూన్ 1న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ఈ నెల 31వ తేదీన (శనివారం) పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.
పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన నగదును ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. నగదును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం 7 గంటలకే నేరుగా ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందించనున్నారు. 31వ తేదీన అందుబాటులో లేకుంటే జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు నగదు ఇవ్వనున్నారు.
కొత్తగా 71,380 మందికి పెన్షన్లు: ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే తదుపరి పింఛన్ భార్యకు అందించేలా కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్పౌజ్ కేటగిరీ కింద వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా 71 వేల 380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ ఏడాది మే నెల నుంచి స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల జారీకి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నెలకు రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్ల జారీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ 12 తేదీన ఈ పెన్షన్లను లబ్దిదారులకు అందించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు 35 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే తదుపరి పింఛన్ భార్యకు అందించేలా ఈ స్పౌజ్ కేటగిరీ కింద గతేడాది నవంబర్ నుంచే అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
రాజమహేంద్రవరంలో చంద్రబాబు: శనివారం మధ్యాహ్నం చంద్రబాబు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కాట్రేనికోన మండలం చెయ్యేరు చెరువులో పూడికతీత పనులను పరిశీలించి ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. గ్రామం పరిధిలో ఉపాధి హామీ పథకం నిధులతో పూడిక తీసే ఉపాధి కార్మికులతో మాట్లాడనున్నారు. అనంతరం‘పేదల సేవలో’లో కార్యక్రమంలో భాగంగా (P4) బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత ఇచ్చే కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. 2.10 నుంచి 3.30 గంటల వరకు సీహెచ్ గున్నేపల్లి గ్రామస్థులతో మాట్లాడుతారు. 3.35 నుంచి 5.05 గంటల వరకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.