ETV Bharat / state

జనసైనికులు అప్రమత్తంగా ఉండాలి -ఆవేశాలకులోనై ఘర్షణకు తావీయవద్దు: డిప్యూటీ సీఎం పవన్‌

'రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి'

pawan-kalyan-iinstructions-to-janasena-activists
pawan-kalyan-iinstructions-to-janasena-activists (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 13, 2025 at 10:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pawan kalyan Iinstructions to Janasena Activists : రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈమేరకు జనసైనికులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ముసుగులో, యూట్యూబ్‌ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నామని అన్నారు. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావారణానికి తావీయవద్దని తెలిపారు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు.

సమస్య జటిలం చేయొద్దు : ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణలు పవన్ తెలిపారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడని, అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలని అన్నారు. దానిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి ముందుకు వెళ్లాలన్నారు. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణపడటం ద్వారా సమస్య జటిలం అవుతుందని వివరించారు. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారన్నారు.

పవన్ కల్యాణ్​పై ఫొటోలపై పిల్‌ - కొట్టేసిన ధర్మాసనం

మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణకు ఆదేశం : కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచిస్తున్నానన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని చట్టం ముందు నిలపాలని వెల్లడించారు. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలన్నారు. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చానన్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచించానన్నారు. కుట్రలు చేసేవారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్ సూచించారు.

'సూపర్​ సిక్స్​-సూపర్​ హిట్​' - భారీగా తరలివచ్చిన జనం

మరోవైపు పవన్ కల్యాణ్​ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో తొలగించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌ (పిల్‌)ను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి చిత్రపటాలను ఏర్పాటు చేయకూడదని ఎక్కడా నిషేధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిల్‌ను రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టి పిల్‌లు వేయాలని పిటిషనర్‌ను హైకోర్టు హితవు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.