'100 శాతం దివ్యాంగురాలు - 25 ఏళ్లుగా మంచానికే పరిమితం' - పింఛన్ ఇవ్వండి సార్!
100 శాతం శాశ్వత దివ్యాంగురాలిగా జన్మించిన యువతి - పసిబిడ్డ మాదిరి కుమారి ఆలనాపాలనా చూస్తున్న తల్లిదండ్రులు - ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2025 at 12:03 PM IST
Parents Waiting for Help for Their Disabled Daughter in Vijayawada: రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాల్లేక విజయవాడకు వచ్చి నివాసం ఉంటున్నారు. అలాంటి పేద కుటుంబంలో జన్మించిన ఆ యువతి పుట్టుకతోనే 100 శాతం శాశ్వత దివ్యాంగురాలు. 25 వయసు దాటినా ఇంకా పసి బిడ్డ మాదిరిగా తల్లిదండ్రులు సాకాల్సిన పరిస్థితి. సాయం కోసం దీనంగా వేడుకుంటున్నారు.
రోజు వారీ కూలీగా పని చేస్తూ జీవనం: మంచానికే పరిమితమైన ఆ యువతి పేరు కిరణ్ కుమారి. తల్లిదండ్రులు ఇనుపకుర్తి నరసమ్మ, సూరిబాబు. 27 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాలవసల నుంచి విజయవాడకు వలస వచ్చి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ప్రసాదంపాడు దగ్గర కార్మిక నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కిరణ్ కుమారి 100 శాతం శాశ్వత దివ్యాంగురాలు. విజయవాడకు వచ్చిన మొదటిలో తండ్రి సూరిబాబు రిక్షా కార్మికుడిగా, తల్లి నరసమ్మ రోజు వారీ కూలీగా పని చేస్తూ జీవనం సాగించేవారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు: కిరణ్ కుమారి పుట్టుకతోనే 100 శాతం దివ్యాంగురాలు కావడంతో తల్లి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ ఆలనాపాలన చూసుకుంటున్నారు. తండ్రి రోజంతా రిక్షా తొక్కుతూ వచ్చి ఆదాయంతో పాటు కుమార్తెకు వచ్చే రూ.6,000 పింఛన్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రూ.15,000 పింఛన్‌కు తమ కుమార్తెకు అన్ని అర్హతలు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అనేక సార్లు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకి చిన్న మెదడు ఎదుగుదల లేక ఏ అవయవమూ సరిగా పనిచేయడం లేదని తల్లి నరసమ్మ తెలిపారు. మెరుగైన వైద్యానికీ తమ వద్ద డబ్బులు లేవని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.
మా కుమార్తెకు రూ.15,000 పింఛన్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. కాని ఎన్నిసార్లు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కుమార్తెకి చిన్న మెదడు ఎదుగుదల లేక ఏ అవయవమూ సరిగా పనిచేయడం లేదు. మా దగ్గర వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం కాని ఎవరైనా దాతలు గాని మాకు సాయం చేయాలని వేడుకుంటున్నాము.-సూరిబాబు, కిరణ్ కుమారి తండ్రి
'నాకో ఉద్యోగం ఇప్పించండి' - చక్రాల కుర్చీపై సచివాలయానికి సుజాత
90శాతం వైకల్యం- నడవడం, మాట్లాడడం రాకపోయినా చెస్‌లో అద్భుతాలు!

