Parents Are Facing Difficulties In Old Age : ‘పోషణ విషయంలో సంతానం(కుమారులు, కుమార్తె) నిర్లక్ష్యం వహిస్తే ఆస్తులను తిరిగి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది’ అవును నిజమే. అమ్మనాన్నలు అనాథలవుతున్నారు. వృద్ధాప్యమనేది వారికి శాపంగా మారుతోంది. అవసాన దశలో ఆదరించలేమంటూ వారి సంతానం చేతులెత్తేస్తున్నారు. మరికొంతమందేమో తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులన్నీ పంచుకుని వారిని పస్తులుంచుతున్నారు. భూములు లాక్కొని బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న ఘటనలు ఇటీవల కాలంంలో ఆందోళన కలిగిస్తున్నాయి. చాలామంది వృద్ధులు తమ దీనస్థితిని బయటికి చెప్పలేక పంటిబిగువున దాచుకుంటున్నారు.
వృద్ధులకు రక్షణగా : వయోవృద్ధుల కోసమని కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వృద్ధుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల రక్షణ కోసం నియమావళిని రూపొందించింది. ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఓ ట్రైబ్యునల్ ఏర్పాటుచేశారు. దీనికి ఆర్డీవో( రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి) ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. న్యాయస్థానాలకు ఉండే అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. ఈ ట్రైబ్యునల్ తల్లిదండ్రులు, వృద్ధుల కేసులను విచారించి 90 రోజుల్లో తీర్పు ఇస్తుంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా! : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వృద్ధుల సమస్యల పరిష్కారమనేది ఆశించిన విధంగా జరగడం లేదు. ఆర్డీవోలు(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు) ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో భాగంగా వృద్ధుల ఫిర్యాదులపై అంతగా దృష్టిసారించడం లేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించేటువంటి ప్రజావాణిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నప్పటికీ పరిష్కారాలు చాలా తక్కువ. 6 జిల్లాల పరిధిలో కనీసం ట్రైబ్యునల్ కమిటీ నియామకం చేసిన దాఖలాలులేవు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం నైన్‌పాకకు చెందిన గోనెల రాధమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కుమారుడు అంత్యక్రియలు నిర్వహించకుండానే ఊరొదిలి వెళ్లిపోయాడు. దీంతో కుమార్తె అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది.
- దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట నివాసి అక్కంపెల్లి సమక్క. 15 సంవత్సరాల కిందట భర్త మృతిచెందారు. ఇద్దరు కుమారులకు నాలుగు ఎకరాల చొప్పున, ఇంటి స్థలాన్ని చెరిసగం రాసి ఇచ్చారు. తన జీవనాధారం కోసం పెట్టుకున్న అర ఎకరం స్థలాన్ని కూడా తనకు తెలియకుండా కుమారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆమె వాపోయారు. తనకు క్యాన్సర్ మహమ్మారి కారణంగా కడుపులో గడ్డ ఏర్పడిందని వైద్య సహాయం కోసం ఎవరూ పట్టించుకోవడంలేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తన వైద్య ఖర్చులు సమానంగా భరించేలా ఇద్దరు కుమారులను ఆదేశించాలని ఇటీవల జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
- ఈ వృద్ధుడి పేరు మహ్మద్ అంకూస్, 85 ఏళ్ల వయసు. కుమారుడు, కోడలు కలిసి 2018లో ఇంట్లో నుంచి ఆయనను బయటికి వెళ్లగొట్టారు. మేస్త్రీగా పనిచేస్తూ ఇంటిని కన్నకొడుకే ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. గతేడాది ‘నాకు న్యాయం చేయండి లేదా జైలుకు పంపండి’ అనే బోర్డు మెడలో వేసుకుని ఆయన నిరసన తెలిపారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదుచేసినప్పటికీ ఫలితంలేదని వాపోయారు.
వృద్ధాశ్రమాలు, ఆలయాలే దిక్కవుతున్నాయి : నిరాదరణకు గురైన వృద్ధులకు ఓల్డేజ్ హోమ్స్, ఆలయాలే దిక్కవుతున్నాయి. ఆర్థిక స్తోమత ఉన్నవారు డబ్బులను చెల్లి స్తున్నారు. వృద్ధాశ్రమంలో కల్పించే వసతులను బట్టి నెలకు 5 వేల రూపాయల నుంచి రూ.15 వేల వరకు వసూలుచేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేని వారు ఆ దేవుడే దిక్కని రోజులు వెళ్లదీస్తున్నారు.
టోల్‌ఫ్రీ నెంబరు 14567 : వృద్ధుల సంక్షేమం, వారి కంప్లైంటుల పరిష్కారానికి ప్రభుత్వం 14567 టోల్‌ఫ్రీ నెంబరు ప్రవేశపెట్టింది. ఈ టోల్ ఫ్రీ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఏడాది కాలంగా వరంగల్ జిల్లాలో 22 ఫిర్యాదులు అందగా 20 పరిష్కరించినట్లు సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.
"వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయాలి. ప్రతి మండలంలో స్పెషల్ అధికారులను నియమించాలి. పోలీస్‌స్టేషన్ పరిధిలోని వృద్ధుల వివరాలను సేకరించి, ప్రతి 2 నెలలకొకసారి పోలీసులు వృద్ధుల కుటుంబాలను సందర్శించాల్సి ఉంటుంది. వృద్ధుల ఫిర్యాదుల కోసం 14567, న్యాయ సహాయం కోసం 15100 నెంబర్లకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి" - కె.మల్లారెడ్డి వయో వృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
ఆడపిల్లలకు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉండదా? - న్యాయ నిపుణుల సమాధానమిదే!
'ఆ ముగ్గురు ఎవరికి వారు బతుకుతున్నారు - ఈ కుమారుడు మమ్మల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నాడు'