Pamarru Digamarru National Road Issue in Eluru District: పామర్రు - దిగమర్రు జాతీయ రహదారి విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులు అరకొరగా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల కిందట జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి 90 శాతం స్థల సేకరణ పూర్తయింది. అయితే గుత్తేదారులు అరకొరగా రోడ్డు నిర్మించడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
నాలుగేళ్ల కిందట కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా దిగమర్రు వరకూ జాతీయ రహదారి 165 విస్తరణ పనులు మొదలయ్యాయి. దీన్ని 4 వరుసలుగా విస్తరించేదుకు 1200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనుల పురోగతి ఉంది. స్థల సేకరణ పూర్తయినా పనులు మందకొడిగా జరుగుతున్నాయి. రహదారి మొత్తం గుంతలమయంగా మారింది.
పీపీ రోడ్ పూర్తయ్యేదెన్నడో: పీపీ రోడ్డు విస్తరణ పనులను రాష్ట్రంలోనే పేరున్న ఓ గుత్తేదారుకి కేటాయించారు. అయితే పనుల నిర్వహణను సదరు కాంట్రాక్టరు ఎక్కడా సక్రమంగా నిర్వహించలేదు. కైకలూరు, ఉండి నియోజకవర్గాల్లో పనులు అటకెక్కాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఉప్పుటేరుపై వంతెన కోసం వేసిన పిల్లర్లు తుప్పు పట్టాయి. స్థల సేకరణ లేని ప్రాంతంలో తారు వేసి రోడ్డును అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నా రోడ్డుపై తవ్విన గుంతలు పూడ్చిన దాఖలాలు లేవు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డుపై రాత్రి వేళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా రహదారి నిర్మాణం పూర్తి చేసి రేడియం స్టిక్కర్లు, ప్రమాద సూచికలు, వీధి లైట్లు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
''ఈ రోడ్డు పనులను మొదలుపెట్టి దాదాపు 2 సంవత్సరాలైంది కాని ఇంకా పూర్తి కాలేదు. దీని వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా మరమ్మతులైనా చేయించాలి.దీని మూలంగా రోడ్లపై పగుళ్లు ఏర్పడి మాకు చాలా కష్టంగా ఉంటుంది. రాత్రి సమయాల్లో ఈ రోడ్డుపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారింది. చీకటిపడిందంటే ఇక్కడ ఏమీ కనిపించవు. ప్రభుత్వం సరిగ్గా దీనిపై దృష్టి పెట్టినట్లయితే కేవలం నెల రోజుల్లోనే పూర్తి అయిపోతాయి. అలాంటిది రోడ్డు పనులను ఎందుకు నిలిపివేశారో అర్థం కావడం లేదు''-ప్రయాణికులు