Vanajeevi Ramaiah Passes Away : పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య, ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్రను సృష్టించారు. 2017లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. రోడ్ల పక్కన, పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాల్లో వనజీవి రామయ్య మొక్కలు నాటేవారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ ఆయన నిత్యం ప్రచారం చేసేవారు.
8 పదుల వయసులోనూ మొక్కలు నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తూ అటవీ సంరక్షణనే తన ఇంటిపేరుగా మార్చుకొని వనజీవిగా గుర్తింపు పొందారు. 1960 నుంచి వృక్షాలు పెంచడమే జీవితంగా మార్చుకున్న ఆయన, కోటికి పైగా మొక్కలు నాటారు. 2 వేలకు పైగా పాఠశాలల్లో ఆయన నాటిన వృక్షాలు ఉన్నాయి. తోటివారినీ మొక్కలు పెంచాలంటూ ఆయన ప్రోత్సహించేవారు. చెట్టు రూపంలో తయారు చేసిన ఫ్లకార్డును ధరించి కడదాకా వృక్షో రక్షతి రక్షితః అని ప్రచారం చేశారు.
చదివింది ప్రాథమిక విద్య : రామయ్య చదివింది ప్రాథమిక విద్యనే అయినా చెట్లే మానవ ప్రగతి మెట్లని బాల్యంలోనే గ్రహించారు. మొదట్లో మహనీయుల జయంతి, వర్థంతుల రోజు మొక్కలు నాటిన వనజీవి, ఆ తర్వాత పూర్థిస్థాయిలో పెంపకం చేపట్టారు. చెట్టు గొప్పదనాన్ని తెలిపేలా 60 వరకు పాటలు, 2 వేలకు పైగా సూక్తులు రాశారు. మొదట్లో మొక్కలు నాటుతుంటే అందరూ చూసి నవ్వినా అలాంటి వారిని పట్టించుకోకుండా పచ్చని వనాలే లక్ష్యంగా మొక్కలతోనే సహాజీవనం చేశారు.
ఎవరు తన ఇంటికి వచ్చినా రామయ్య మొక్కలను బహుమతిగా ఇచ్చేవారు. రుతువులకు అనుగుణంగా విత్తనాలు సేకరించి మొక్కలను నాటేవారు. ఆయన గురించి తెలుసుకున్న చంద్రబాబు ఓ ద్విచక్రవాహనం కొనివ్వగా ఆ వాహనంపై తిరుగుతూ ఇంకా ఉత్సాహంగా మొక్కలు నాటడంలో నిమగ్నమయ్యారు. దేశానికి ప్రతిభావంతులైన పౌరులేకాదు బండరాళ్లనైనా పెకిలించి చెట్లను పెంచే పౌరులు అత్యవసరమని భావించేవారు రామయ్య. ప్రతి తల్లి తన పిల్లలతో మూడు మొక్కలు నాటించాలని హితోబోధ చేశారు.
పర్యావరణ పరిరక్షణకు రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ 2013లో డాక్టరేట్ ప్రదానం చేసింది. నాటి ప్రధాని పీవీ సహా గవర్నర్లు, ముఖ్యమంత్రుల నుంచి సత్కారాలు అందుకున్నాడు. రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగాన రామయ్య సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల నగదుతో పాటు జ్ఞాపికను బహుకరించింది.
దాదాపు 5 దశాబ్దాలుగా మొక్కలు నాటడం కర్తవ్యంగా భావించడమే కాదు తెలుగునేలను హరితమయం చేసిన వనజీవి రామయ్యను కేంద్రం దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం : వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామయ్య చేసిన కృషి యువతలో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుందని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్టు చేశారు.
దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…
— Narendra Modi (@narendramodi) April 12, 2025
సమాజానికి తీరని లోటు : సీఎం రేవంత్ పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని తెలిపారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళిని సీఎం అర్పించారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.
తీవ్ర విచారానికి లోనయ్యా: ఏపీ సీఎం చంద్రబాబు వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనైనట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పచ్చదనం ప్రాధాన్యత చెప్పిన రామయ్య నేటితరానికి ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని, కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించి, పద్మశ్రీ అవార్డు గ్రహించిన దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమై ఆరున్నర దశాబ్దాలుగా ఆయన హరిత యాత్రను కొనసాగించారన్నారు. అనారోగ్య సమస్యలు వేధించినా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని కొనియాడారు. వారి జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి, దార్శనికుడు రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమి డిప్యూటీ సీఎం చింతించారు.
కేసీఆర్ సంతాపం : వనజీవి రామయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి కృషిని ఆయన స్మరించుకున్నారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ కోసం రామయ్య త్యాగం అసమాన్యమైనదని కొనియాడారు. హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామయ్య అందించిన సహకారం గొప్పదని, రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ తెలిపారు.
మొక్కలను బిడ్డల వలే పెంచారు : హరీశ్‌రావు ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచారన్నారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారని వివరించారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని, ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తి అని చెప్పుకొచ్చారు.
Vanajeevi Ramaiah: మరోసారి వనసంరక్షణపై మమకారాన్ని చాటుకున్న వనజీవి
మొక్కలు నాటడంలో 'వనజీవి' తనదైన ముద్ర.. కదల్లేని స్థితిలోనూ..!