Paddy Procurement in Telangna : తెలంగాణలో యాసంగి వడ్ల కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పౌరసరఫరాల శాఖ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సీజన్ కొనుగోళ్లను జూన్ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించినట్టు పౌరసరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే, ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు వెంటనే డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 14 జిల్లాల్లో :
పంట కోతలను బట్టి ఆయా ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 జిల్లాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ (మంగళవారం) నాటికి నాటికి 1,838 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల ద్వారా 95,131 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 9,973 టన్నులు కాగా, సన్న రకం 85,158 టన్నులు ఉన్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గింజ క్వాలిటీని నిర్ధారించడానిక మైక్రోమీటర్లను సైతం బిగిస్తున్నారు. ఈ మీటర్ల ద్వారా గింజ ఎంత పొడవుగా ఉంది? ఎంత వెడల్పుగా ఉందనే వివరాలను కూడా పక్కాగా కొలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 92,724 టన్నులు మిల్లులకు తరలించగా, మరో 2,407 టన్నులు కేంద్రాల్లో ఉన్నాయి. వీటిని కూడా త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దళారుల వద్దకు వెళ్లొద్దు :
రైతులు ఏడాదికాలం శ్రమ పడి పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని చెబుతోంది. కేంద్రాల్లో వడ్లు అమ్ముకున్నవారికి సాధ్యమైనంత త్వరగా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
220 కోట్లు :
ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్ల కనీస మద్దతు ధర విలువ రూ.220.70 కోట్లుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే రూ.46.54 కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
రూ.500 బోనస్ :
రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ రూ.500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్నదాతలకు బోనస్ ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం లెక్క ప్రకారం చెల్లించాల్సిన బోనస్ మొత్తం విలువ సుమారు రూ.4.99 కోట్లుగా అంచనా వేసినట్టు సమాచారం. అయితే ఈ చెల్లింపులు మొదలు కావాల్సి ఉంది.