ETV Bharat / state

నాకు అక్షరాలు సరిగా కనిపించడం లేదు! - చిన్నారుల్లో పెరుగుతున్న దృష్టిలోపం

గంటల తరబడి టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్న చిన్నారులు - మయోపియా, హైపర్‌ మెట్రోపియా కారణంగా పిల్లల్లో కంటి చూపు మందగింపు - కొందరిలో పుట్టుకతోనే ఈ సమస్య - ఈ జాగ్రత్తలు పాటించమంటున్న నిపుణులు

Eye Problem in Kids in Telangana
Eye Problem in Kids in Telangana (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : August 31, 2025 at 5:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Eye Problem in Kids in Telangana : హైదరాబాద్​ నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి చంద్రశేఖర్​ కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా సక్రమంగా నోట్స్ రాయలేకపోవడం, చదవలేకపోవడాన్ని తండ్రి గమనించారు. కారణమేంటని కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. తనకు బోర్డుపై అక్షరాలు సరిగా కన్పించడం లేదని అర్థం చేసుకుని రాసేలోపు సమయం అవుతోందని తెలిపింది. వెంటనే ఆ తండ్రి ఆమెను కంటి వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు మయోపియా ఉన్నట్లు తేల్చారు. ఎలాంటి ఇబ్బంది లేదని కళ్లద్దాలు ధరిస్తే సిరిపోతుందని సూచించారు.

మయోపియా, హైపర్​ మెట్రోపియా కారణంగా పిల్లల్లో కంటి చూపు మందగిస్తోంది. వీటిని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్​గా పిలుస్తారు. బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడానికి 80 శాతం మయోపియా, మరో 20 శాతం హైపర్​ మెట్రోపియా కారణని నేత్ర వైద్యులు చెబుతున్నారు.

తక్కువ కాంతిలో చూడటం వల్ల : సాధారణంగా నేత్రాలకు వెయ్యి లక్స్ కంటే ఎక్కువ కాంతి అవసరం. అప్పుడే కళ్లు తేజోవంతంగా పనిచేస్తాయి. కళ్లకు అవసరమైన కాంతి కంటే తక్కువ కాంతిలో చదవటం వల్ల, టీవీలు, కంప్యూటర్లను తక్కువ కాంతిలో గంటలు తరబడి చూడటం వల్ల మయోపియాకు దారి తీస్తుంది. కొందరి పిల్లల్లో పుట్టుకతోనే ఈ సమస్య ఉంటుంది. కొందరికి యుక్త వయస్సు వచ్చే వరకు సమస్య రాదు.

  • మయోపియా వల్ల దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు.
  • హైపర్ మెట్రోపియా కారణంగా దూరం, దగ్గరగా ఉన్న వస్తువులు ఏవీ వారికి సరిగ్గా కనిపించవు.

ఎలా వస్తుంది? : అతి దగ్గరగా, తక్కువ కాంతిలో ఫోన్​, ట్యాబ్, టీవీలను గంటల తరబడి చూడటం వల్ల పిల్లల్లో మయోపియా, హైపర్ మెట్రోపియా వచ్చే ప్రమాదముంది. కొవిడ్ ద్వారా పిల్లల్లో ఈ దృష్టి సమస్య ఎక్కవగా గుర్తిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

ఏం చేయాలి? : ప్రతి సంవత్సరం పిల్లలకు నేత్ర పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో పాలుపంచుకునేలా చేయాలి. సహజ సూర్య కాంతి వల్ల మానవ నేత్రం మయోపియాకు గురి కాకుండా రక్షిస్తుంది. సూర్య కాంతి ద్వారా మనకు లభించే డి-విటమిన్​ వల్ల చాలా ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

20-20-20 నిబంధన పాటించాలి : పిల్లలు డిజిటల్ పరికరాలు ఉపయోగించే సమయం తగ్గించాలి. 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వారి చేతికి సెల్​ ఫోన్​ వంటి డిజిటల్ పరికరాలు ఇవ్వకూడదు. కంటికి దగ్గరగా పెట్టి చదవడం, రాయడం కూడా ఈ సమస్యలకు కారణమవుతోంది. 20-20-20 నిబంధన పాటించాలి. ప్రతి 20 నిమిషాలు కంప్యూటర్ లేదా ఏదైనా స్క్రీన్​ చూసిన తర్వాత 20 సెకన్లు చూపు మరల్చాలి. 20 అడుగుల దురంలో ఉన్న ఏదైనా వస్తువును చూడాలి. ఇది కంటి కండరాలను సడలిస్తుంది.

చిన్నారుల్లో మయోపియా సంకేతాలను గుర్తించడంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బ్లాక్​ బోర్డుకు దగ్గరగా వెళ్లి చదువుతున్నారా ఇంట్లో దూరపు వస్తువులు చూడలేకపోతున్నారా తదితర లక్షణాలు గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుని చికిత్స అందించాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, మాంసం, గుడ్డు, పాలు ఇలా అన్నీ ఉండేలా చూసుకోవాలి. - రాజలింగం, సీనియర్‌ ప్రభుత్వ నేత్ర వైద్యులు

మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి

కళ్లద్దాలు రోజు పెట్టుకుంటే చూపు మందగిస్తుందా? సైట్ వస్తే తగ్గించుకోవచ్చా? కళ్లకు ఏం తింటే బెస్ట్?