Fee Policy in Engineering Courses : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో ఇంజినీరింగ్‌తో పాటు అన్ని ఉన్నత విద్యా కోర్సులకు గతంలో ఉన్న ఫీజులే అమలు కానున్నాయి. ఎప్‌సెట్ సహా లాసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, ఐసెట్, పీఈసెట్‌ల కౌన్సెలింగ్ గత ఏడాది ఫీజులతోనే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీన్నిబట్టి బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీపీఎడ్, డీపీఎడ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు పాత ఫీజులే వర్తించనున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
ఫీజుల విధానంపై అధ్యయనం : ఇంజినీరింగ్‌లో ఫీజులు భారీగా పెరుగుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం, ఫీజులు ఖరారు చేసే ముందు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఇదివరకు ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజుల విధానంపైనా అధ్యయనం చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా పాత ఫీజుల ప్రకారమే (ఇంజినీరింగ్‌లో గరిష్ఠ ఫీజు రూ.1.65 లక్షలు) మొదటగా ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రకారం షెడ్యూల్‌ను మంగళవారం లేదా బుధవారం (జూన్ 25) ఖరారు చేసి విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు, ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. ఆ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీలోపు మొదటి ఫేజ్ సీట్లు కేటాయిస్తారు. వారు ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్లు పొందుతున్నందున ఆ విద్యార్థులకు కూడా నిబంధనల ప్రకారం పాత ఫీజులే వర్తించనున్నాయి.
ఇప్పటికీ స్పష్టత కరవే : ప్రస్తుతానికి అన్ని కోర్సులకూ పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నా, విద్యా సంవత్సరం మధ్యలో కొత్త ఫీజు విధానం అమలు చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాదికి ఫీజులు పెంచేది లేదని ప్రకటిస్తే ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ప్రభుత్వం జారీ చేసే జీవో ప్రకారం ఫీజులుంటాయని, ప్రస్తుతానికి పాత ఫీజులే వర్తిస్తాయనే నిబంధన విధించే అవకాశమే ఇప్పటివరకు ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యార్థులపై తగ్గనున్న ఆర్థిక భారం! - ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటేనే సాధ్యం
పాత రుసుములతోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ - పెరిగితే ఎంత ఉండొచ్చంటే?