Officials Working to Enroll out of School Childrens into Schools: బాల్యం బడికి దూరం కాకూడదు. చిన్నారులు ఎవరైనా చదువు మానేస్తే అన్ని కోణాల్లో విశ్లేషించి తిరిగి బడికి పంపించడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. నూతన విద్యా సంవత్సరం ఆరంభమయ్యే తరుణంలో బడికి రాని బాలల కోసం అన్వేషణ సాగుతోంది. సమగ్ర శిక్షా ప్రాజెక్టు సెక్టోరల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో తిరుగుతూ చిన్నారుల వివరాలను నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గతేడాది 'డ్రాప్‌బాక్సు'లోని వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో 2024-25వ సంవత్సరంలోని డ్రాపౌట్స్ జాబితా ప్రకారం యుడైస్ ద్వారా 21,328 మంది ఉన్నారని నమోదైనా వాస్తవంలో 6,296 మంది బడి మానేసిన వారున్నారని నిర్ధారించారు. వీరందరినీ ఈ ఏడాది ఖచ్చితంగా పాఠశాలల్లో చేర్పించే కసరత్తు నడుస్తోంది.
అన్ని ఆధారాలతో సేకరణ: చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు, అనుకూలమైన రవాణా సౌకర్యం లేక, వేరే జిల్లా, రాష్ట్రం, దేశంలో జీవించడం, వలస వెళ్లిపోవడం, రెండుసార్లు నమోదు కావడం, అనాధలు, దూర విద్య అభ్యాసం, వివరాల నమోదులో తప్పిదాలు వంటి 9 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని బడి బయట ఉన్న వారి కోసం అధికారులు వెతుకుతున్నారు. దొరికిన వివరాలను ప్రధానోపాధ్యాయుల లాగిన్లో పెడుతున్నారు. అక్కడి నుంచి ఎంఈవో, డీఈవో లాగిన్లకు వెళ్తాయి. ఆ వివరాల ప్రకారం క్షేత్ర స్థాయిలో సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు పరిశీలిస్తున్నారు.
మీ పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం - విద్యార్థుల తల్లిదండ్రులకు HM లేఖ
ప్రవేశాలకు శిబిరాలు: ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం త్వరలో శిబిరాలు నిర్వహించనున్నారు. 6 నుంచి 18 ఏళ్ల లోపు బాలలందరినీ ఏదొక బడిలో చేర్పించాల్సి ఉంది. గతేడాది ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదివిన వారిని 6వ తరగతిలో, ప్రాథమికోన్నతలో 7వ తరగతి చదివిన వారిని ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో తప్పనిసరిగా చేర్పించాలి. యూడైస్ కోడ్, ఆధార్ సంఖ్య ఆధారంగా విద్యార్ధుల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.
మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా: విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా 60 మంది విద్యార్ధులు దాటిన పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలుగా చేస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొంది. తద్వారా పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంటుంది. తదనుగుణంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరగనుందని తెలుస్తోంది.
6296 మందిని బడిలోకి చేర్చే కార్యాచరణ: పదో తరగతి తర్వాత ప్రైవేటుగా చదవడం, వలస వెళ్లడం, చనిపోవడం, తప్పు వివరాల నమోదు వంటి అంశాలపై దృష్టి సారించామని సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి ఎస్.సుభాషిణి తెలిపారు. 6296 మందిని ఈ విద్యా సంవత్సరంలో బడిలోకి చేర్చే కార్యాచరణ నడుస్తోందన్నారు.
'మీకు ఏం సౌకర్యాలు కావాలో అడగండి' - విద్యార్థినులతో సీఎం చంద్రబాబు
ఆకలితో పాఠశాలకు పిల్లలు - సొంత ఖర్చులతో టిఫిన్ అందిస్తున్న ఉపాధ్యాయుడు