తిరుపతిలో బార్లు, స్పా సెంటర్ల నిర్మాణమా! - మత సంప్రదాయాలకు విరుద్ధం
ఒబెరాయ్ హోటళ్లకు కేటాయించిన భూమిపై హైకోర్టులో టీటీడీ ఈవో అఫడవిట్ - భూమి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ బోర్డు తీర్మానం చేసినట్లు వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 21, 2025 at 7:56 AM IST
OBEROI GROUP HOTELS LAND ISSUE: తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామం పరిధిలో ఒబెరాయ్ గ్రూప్ సంస్థ హోటళ్లను నిర్మించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ టీటీడీ బోర్డు గతేడాది నవంబర్ 18న తీర్మానం చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఒబెరాయ్ సంస్థ నిర్మించే ముంతాజ్ హోటల్స్, ట్రైడెంట్ 5 స్టార్ హోటళ్లలో విలాసవంతమైన విల్లాలతోపాటు బార్లు, లాంజ్, పార్టీ హాళ్లు, స్పా నిర్మించేందుకు గత ప్రభుత్వం అనుమతించడం తిరుమల కొండ పవిత్రత, ఆధ్యాత్మిక, హిందూ మత సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఒబెరాయ్ గ్రూప్‌నకు కేటాయించిన భూమిని రద్దు చేసి తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఆ 20 ఎకరాలను టీటీడీకి కేటాయించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని కోరుతూ టీటీడీ గతేడాది డిసెంబర్లో లేఖ రాసిందన్నారు.
తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను ‘తిరుమల దివ్వ క్షేత్రం’గా ప్రకటిస్తూ రాష్ట్రప్రభుత్వం 2007 జూన్‌లో జీవో 746 జారీ చేశారని గుర్తు చేశారు. ఏడు కొండలు, అందులోని తీర్థాలు, దేవస్థానికి చేరుకునే అన్ని మార్గాలను తిరుమల దివ్వ క్షేత్రం పరిధిలోకి తెచ్చారన్నారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 114 తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆ ప్రాంతంలో భిక్షాటన, మత్తుపదార్థాల సేవనం, జంతువధ, తదితర కార్యక్రమాలను నిషేధించేందుకు అధికారం కల్పిస్తోందన్నారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత పిల్‌లో తగిన ఉత్తర్వులివ్వాలని ఈ ఏడాది జనవరిలో హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒబెరాయ్ హోటళ్లకు కేటాయించిన భూమి రద్దు చేయాలని తిరు క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు టి. ఓంకార్, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసనంద స్వామీజీ హైకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం, టీటీడీ ఈవో, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తుడా వైస్ ఛైర్మన్, ఒబెరాయ్ గ్రూప్ హోటళ్ల ఎండీ, అదే గ్రూపునకు చెందిన ముంతాజ్ హోటల్స్, ట్రైడెంట్ ఫైవ్‌స్టార్ హోటల్స్ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని గత విచారణలో ఆదేశించింది.
'దేవుడికి ఇచ్చిన సొమ్మును ఎలా వాడతారు?' - టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు ఆగ్రహం

