NTR Baby Kit Scheme for Women: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా మరిన్ని పథకాలను కూటమి ప్రభుత్వం తీసుకొస్తోంది. తాజాగా ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పథకం కోసం 51.14 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1410 విలువ చేసే ఈ కిట్‌ను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం పునరుద్ధరణ ద్వారా సుమారు 4 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది.
11 వస్తువులతో కూడిన కిట్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న గర్భిణులకు ఈ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందించనున్నారు. ఈ బేబీ కిట్‌లో మొత్తం 11 రకాల వస్తువులు ఉంటాయి. దోమల నుంచి రక్షణకు ఒక దోమ తెరతో కూడిన బెడ్, దోమతెర, రెండేసి టవల్స్, డ్రెస్సులు, ఉతుక్కోవడానికి వీలుగా ఉండే న్యాప్‌కిన్లు, జాన్సన్ కంపెనీకి చెందిన 200 గ్రాముల బేబీ పౌడర్ ఒకటి, 100 ఎంఎల్ ఒక షాంపూ (జాన్సన్), 200 ఎంఎల్ నూనె, 2 సబ్బులు, సబ్బు బాక్సు, గిలకను ఈ కిట్‌తో పాటు ఇస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చి డిశ్ఛార్జి అయ్యే సమయంలో తల్లులకు ఫ్రీగా ఈ కిట్లను అందించనున్నారు. ఈ కిట్లను పంపిణీ చేయడాన్ని తొలుత 2016 జులై 1వ తేదీన నాటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021లో నిలిపేసింది. ఆగిన పథకాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధులు సైతం విడుదల చేశారు.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగం: ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాల వారే వస్తుంటారు. శిశువుల కోసం పాత వస్త్రాలను వినియోగిస్తూ ఉంటారు. దీనివల్ల శిశువులకు ఇన్‌ఫెక్షన్లు, రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని పునరుద్ధరించింది.
మరోవైపు ప్రభుత్వ హాస్పిటల్స్‌లలో సుఖప్రసవాలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై భరోసా కలిగించి, కాన్పుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతోనే పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి సాధారణ ప్రసవం చేసుకుని ఉచిత రవాణాలో ఇంటికి చేర్చే వరకు అనేక రకాలైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. సిజేరియన్ ప్రసవాలు సైతం ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ హాస్టిటల్స్లలో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు: సీఎం చంద్రబాబు
ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు - ఇక లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ