Poor Road Quality in Manyam District: నిన్నటి వరకు రోడ్లు లేవు. ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నారు. అయితే ఆ రోడ్లు వేసిన వారం రోజుల్లోనే పెచ్చులుగా ఊడిపోతున్నాయి. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం మండలంలోని అంటిజోల నుంచి మనిగ వరకూ ఇటీవల తారురోడ్డు వేశారు. రెండు కిలోమీటర్ల మేర రహదారిని కోటి 57 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే తారురోడ్డు వేసిన రెండు వారాలకే పెచ్చులు పెచ్చులుగా లేచిపోతోంది. నాణ్యతా ప్రమాణాలు సరిగా పాటించలేదని గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్లు అధ్వాన స్థితికి చేరాయని వాపోతున్నారు.
ఈ సమస్యను పంచాయతీరాజ్ జేఈ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాల రాకపోకలతో మలుపులు, ఘాట్ల వద్ద కొంతమేర పెచ్చులూడిపోయాని అన్నారు. పరిశీలించి నెలాఖరులోగా మొత్తం పనులను పూర్తి చేస్తామని చెప్పారు.