No Funeral Facilities in Few Villages In West Godavari District : ఇంట్లో మనిషి చనిపోయాడన్న బాధ కంటే ఆ మృతదేహానికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలన్న ఆందోళన వెంటాడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్మశానవాటికల అభివృద్ధికి రూపాయి కూడా విడుదల చేయకపోగా, ఉన్న వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల కాలువ గట్లు, రహదారులపైన దహన సంస్కారాలు చేస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలూ కరవే : చాలాచోట్ల శ్మశానాలు లేకపోగా, ఉన్నవాటిలో కూర్చునేందుకు బల్లలు, స్నానం చేసేందుకు నీటి సౌకర్యం వసతులు లేవు. ఆలమూరు శివారు కోమటిచెరువు దగ్గర శ్మశానవాటిక లేకపోవడంతో భగ్గేశ్వరం డ్రెయిన్‌పై దహనం చేస్తున్నారు. పొలమూరులో సుమారు 500 కుటుంబాల శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారు. వనంపల్లి, మామిడూరు గ్రామాల్లో సౌకర్యాలు లేవు. తణుకు మండలం కోనాల, ముద్దాపురం, దువ్వ గ్రామాల్లోని శ్మశానవాటిక లేక యనమదుర్రు గట్టుపక్కనే దహన సంస్కారాలు చేస్తున్నారు. వర్షాలకు గట్టుపైకి నీరు చేరితే రెండు, మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంటి దగ్గర భద్రపరచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వశిష్ఠ గోదావరిని ఆనుకుని ఉన్న సిద్ధాంతంలో శ్మశాన వాటిక లేక గోదావరి గట్టునే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందడంతో చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. కేదార్‌ఘాట్ ఒడ్డున, గోదావరిలోని నీరు పైకొస్తే రోడ్లపై దహనం చేస్తున్నారు. వైకుంఠధామాల్లో ఎక్కడా కనీస సౌకర్యాలు లేవని గత పాలకులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని పరిస్థితులపై కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అంతిమ సంస్కారానికీ అవస్థలే - శ్మశానవాటికకు వెళ్లాలంటే బురద దారే దిక్కు - Muddy Path to The Graveyard
కూటమి చొరవ: అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులున్న గ్రామాలను గుర్తించి ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో శ్మశానవాటికల నిర్మాణాలకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆచార వ్యవహారాల నిర్వహణకు వసతులు, చుట్టూ కంచె నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు డ్వామా పీడీ అప్పారావు తెలిపారు.
తండ్రి అంత్యక్రియలు చేసిన కుమార్తె - అభినందించిన గ్రామ పెద్దలు - Daughter Done Last Rites to Father