Nizamsagar Water Canal Occupied : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి ఆనుకొని ప్రవహించే నిజాంసాగర్ ప్రధాన కాలువ పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. ఈ కాలువ ద్వారా ఆర్మూర్ నుంచే ఫత్తేపూర్ వరకు ఆయకట్టు భూములకు సాగు నీరందుతుంది. ఇప్పటికి 683 అక్రమ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఈ కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. తూములు మూసుకుపోవడం వల్ల కాలువ కట్టతెగి పలు కాలనీల్లోకి నీరు చేరింది.
జనం ఆందోళన : కాలువ కట్టలపై పేద ప్రజలే కాకుండా వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు దుకాణ సముదాయాలు నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించి కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. గుత్ప ఎత్తిపోతల పథకానికి త్వరలో నీటిని విడుదల చేయనున్నారు. భారీ వర్షాలకు వరద వచ్చి కాలువలోకి చేరుతోంది. అక్రమ నిర్మాణాలతో ఇప్పుడు కట్టలు బలహీనమయ్యాయి. నీరొస్తే మళ్లీ ఎప్పుడు కట్ట తెగుతుందోనని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనం ఆందోళన చెందుతున్నారు.
కబ్జాలపై అధికారుల ఫోకస్ : పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి, వ్యాపారులు అక్రమంగా వేసుకున్న దుకాణాలతోపాటు ఇళ్లనూ కూల్చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజాంసాగర్ కాలువ గట్లపై కబ్జాలు నిజమేనని నీటిపారుదల శాఖ అధికారులు ఒప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులకు లేఖ రాశామని త్వరలోనే ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు.
ఇక్కడి ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కాలువ పూర్తిగా కబ్జాకు గురయ్యింది. కాలువ గట్టుపైన ఇళ్లను కట్టారు. భారీ వర్షాలు పడినప్పుడు, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు ప్రవాహ ఉద్ధృతిని తట్టకోలేక కాలువ కట్ట తెగిపోయి, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. అధికారులు కబ్జాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు స్పందించి కాలువను పరిరక్షించాలి. - స్థానికులు, ఆర్మూర్
నిజాంసాగర్ కాలువ గట్లపై కబ్జాలు నిజమే. కాలువ అస్తవ్యస్తంగా మారింది. కాలువ గట్లపై కబ్జాలతో తూములు తెగిపోతున్నాయి. కాలువలకు గండ్లు పడుతున్నాయి. ఈ కబ్జా విషయంపై ఉన్నతాధికారులకు లేఖ రాశాము. త్వరలోనే ఆక్రమణలను తొలగిస్తాము. కబ్జా చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. - నీటిపారుదలశాఖ అధికారి
నిండుకుండలా ఎస్సారెస్పీ - గోదారి పరవళ్లు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు - Heavy Water Inflow to SRSP