Nimmakuru Gurukul Alumni Donates 3 Crores for New School Building : ఆ విద్యాలయం ఓ మహనీయుడు చేతుల మీదుగా పురుడు పోసుకుంది. తన సొంత ఊరిలో 8 ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చి ఆ బడిని నిర్మించారు. అలా ఏర్పాటైన విద్యాలయంలో విద్యను అభ్యసించి ఎందరో ఉన్నతస్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఆ బడి నేడు శిథిలావస్థకు చేరుకుంది. సరిపడా సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేక పిల్లలు తగ్గిపోయారు. ఈ దీనస్థితని గమనించిన పూర్వవిద్యార్థులు మేమున్నామంటూ ముందుకు కదిలారు. తిరిగి విద్యాకుసుమాలు వికసించేలా తమ వంతు కృషి చేస్తున్నారు.
ఎటు చూసినా పగుళ్లు మొన తేలిన ఇనుప చువ్వలు, విరిగేందుకు సిద్దంగా ఉన్న కంకర దిమ్మెలు, ఎప్పడు కూలుతుందో ఊహించలేనంత ప్రమాదకరంగా మారింది ఈ భవనం. మహనీయుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై నెలవైన ప్రతిష్టాత్మక గురుకులంలోని వసతి గృహం దుస్ధితికి చేరింది. కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు ఎన్టీఆర్ స్వగ్రామం. ముఖ్యమంత్రి హోదాలో 1987లో ఆయన ఈ భవనాలకు పునాది వేశారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని తలపోసిన ఎన్టీఆర్ అప్పట్లో తన పేరిట ఉన్న 8 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి మరీ ఈ గురుకులానికి శంకుస్థాపన చేశారు.
తన తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య, వెంకట్రావమ్మ పేరిట ప్రభుత్వ వృత్తి విద్యా పాఠశాల, కళాశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ఈ విద్యాలయంలో 5 నుంచి 12 వ తరగతి వరకు విద్యనభ్యసించేలా సకల వసతులు కల్పించారు. నిపుణులైన అధ్యాపకులను నియమించి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యనందించే ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇక్కడ సీటు సాధించాలంటే విపరీతమైన పోటీ ఉండేది. అలా ప్రవేశాలు పొంది ఇక్కడ చదివి మేటి విద్యార్థులుగా బయటకి వచ్చి ఉన్నతస్థానాల్లో స్థిరపడిన వారెందరో.
నిమ్మకూరులో బాలకృష్ణకు అఖండ స్వాగతం
కొన్నేళ్ల క్రితం వరకు ఇలా విద్యాకుసుమాలు విరాజిల్లిన ఈ గురుకులం ప్రస్తుతం ఇలా శిథిలావస్థకు చేరింది. ప్రమాదకరంగా మారిన భవనాల్లోనే విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి. కనీస సౌకర్యాలు, మరమ్మతులు కరవై కూలిపోయే స్థితికి చేరింది. పదవీ విరమణ చేసిన వారిస్థానంలో నూతనంగా నియామకాల్ని చేపట్టలేదు. ఫలితంగా విద్యా ప్రమాణాలు దిగజారాయి. మొత్తంగా అన్నగారి ఆశయం నీరు గారే పరిస్ధితి వచ్చింది.
దీన్ని గమనించిన ఇదే విద్యాలయంలో ఓనమాలుదిద్దిన పూర్వవిద్యార్థులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. ఇక్కడ చదివి తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో స్ధిరపడిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలను కలిశారు. ఇలా కదిలిన 150 మంది 3 కోట్లు విరాళాలు అందించారు. నెలల వ్యవధిలోనే 200 మంది ఇంటర్ విద్యార్థుల వసతిగృహం కోసం అధునాతన భవనానికి పునాది వేసి ఏడాదిన్నరలోనే పూర్తిచేశారు.
సకల సౌకర్యాలు కల్పిస్తూ సువిశాలంగా నూతన వసతి గృహాన్ని నిర్మించారు. ప్రతి బెడ్‌కు ఓ ఫ్యాన్, లైట్, లగేజీ కోసం ప్రత్యేక అరలు ఏర్పాటు చేశారు. చదువుకునే సమయంలో కరెంట్ పోయినా ఛార్జింగ్ లైట్లను ఏర్పాటు చేశారు. భవనాల ముందు విశాలమైన ఖాళీ స్థలం ఏర్పాటు చేసి స్టడీ అవర్లు, యోగా తరగతులు, పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అతి త్వరలో భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. అయితే తమ ప్రయత్నానికి ప్రభుత్వం కూడా కలసిరావాలని పూర్వవిద్యార్థులు కోరుతున్నారు
'వేల మంది విద్యార్థులకు గొప్ప భవిష్యత్తును అందించిన విద్యాలయం ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. మా వంతు బాధ్యతగా విద్యార్థుల కోసం అధునాతన వసతిగృహ భవనం నిర్మించాం. నిమ్మకూరు విద్యాలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కృషి చేయాలి.' -డాక్టర్ పి.ఎస్.చొక్కలింగం, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు
పీ-4 మూల సిద్ధాంతానికి కార్యరూపం: పూర్వ విద్యార్ధులు తమను ఉన్నత స్థానానికి చేర్చిన పాఠశాల అభివృద్ధికి రూ.3 కోట్ల భారీ విరాళం ఇచ్చారన్న వార్త ఆనందం కలిగించిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు ఇటీవల ప్రారంభించిన పీ-4 మూల సిద్ధాంతానికి కార్యరూపం ఇది అని తెలిపారు. నిమ్మకూరు పూర్వ విద్యార్థుల చేయూత ఉన్నతస్థానాల్లో ఉన్న వారికి స్పూర్తిగా నిలుస్తుందని వెల్లడించారు.
నిమ్మకూరు ప్రభుత్వ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్ధులు తమను ఉన్నత స్థానానికి చేర్చిన స్కూలు అభివృద్ధికి రూ.3 కోట్ల భారీ విరాళం ఇచ్చారన్న వార్త ఆనందం కలిగించింది. చంద్రబాబు గారు ఇటీవల ప్రారంభించిన పీ-4 మూల సిద్ధాంతానికి కార్యరూపం ఇది. నిమ్మకూరు పూర్వ విద్యార్థుల చేయూత… pic.twitter.com/qHGE3LDy3n
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
యాదృచ్ఛికంగా ఆ స్కూలు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ స్వగ్రామం కావడం యావత్ తెలుగుజాతికి గర్వకారణమని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. రానున్న అయిదేళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని కోరుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.