Three Days Rain Alert in Telangana : రాష్ట్రంలో రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
అకాల వర్షాలతో తీవ్రనష్టం : అలాగే రాగల మూడు రోజుల్లో మధ్యాహ్నం సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అంచనావేసింది. గత 3 రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి.
పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిచేల కంకులు రాలిపోగా, కోసిన పంట వర్షానికి తడిసి పనికిరాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో మామిడి కాయలు రాలిపోయి సరైన గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోయారు.