TG New Ration Cards Issue : కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో పౌర సరఫరాల శాఖ వ్యవహరించిన తీరు దరఖాస్తు చేసుకుంటున్న వారికి తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని మీ-సేవ డైరెక్టర్‌కు పౌర సరఫరాల శాఖ లేఖ రాసింది. లేఖ రాసి 24 గంటలు గడవక ముందే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రజా పాలనలో తీసుకున్న లిఖిత పూర్వక దరఖాస్తుల పరిశీలనకే పరిమితం కావాలని నిర్ణయించుకుంది.
గతేడాది నిర్వహించిన ప్రజా పాలన, గ్రామసభలు, ప్రజావాణి లాంటి కార్యక్రమాల్లో రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే శుక్రవారం మీ-సేవ డైరెక్టర్‌కు పౌర సరఫరాలశాఖ ఓ లేఖను రాసింది. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీ-సేవ కేంద్రాల్లో స్వీకరించాలని కోరింది. అదేవిధంగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు మీ-సేవ వెబ్‌సైట్‌లో సైతం ఒక ఆప్షన్ కనిపించింది. దీంతో అనేక మంది దరఖాస్తుదారులు శనివారం మీ-సేవ కేంద్రాలకు క్యూ కట్టారు. మీ-సేవ నిర్వాహకులు మాత్రం ఆ ఆప్షన్‌ను తొలగించారని చెప్పడంతో దరఖాస్తుదారులు నిరాశతో వెళ్లిపోయారు.
ఈ అంశంలో గందరగోళం నెలకొన్న విషయాన్ని ప్రస్తావించగా, ప్రజాపాలన దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ దరఖాస్తులను మీ-సేవ ద్వారా ఆన్‌లైన్ చేయించడం తమ ఉద్దేశమని చెప్పారు. మీ-సేవకు రాసిన లేఖలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందని చెప్పారు. ఇప్పటికే ఉన్న రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు మీ-సేవ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారని వెల్లడించారు.
ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్న ఈసీ : మీ-సేవలో రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించకపోవడంపై ఎన్నికల కోడ్ ఉందనే ప్రచారం సాగింది. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ నిలిపి వేయాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డు కోసం చాలా మంది పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి గుడ్‌న్యూస్ - మీ సేవ కేంద్రాల్లోనూ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో కొర్రీలు! - మీకు ఇవి ఉంటే దరఖాస్తు తిరస్కరణ!