New Policy in Multiple Registration System: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులకు అనుగుణంగా తాజాగా మరో విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఒకే సర్వే నంబరు గల వ్యవసాయ భూమిలోని భాగస్వామ్య వాటాలను, విభాగాలను ఒకే విడతలో పలువురికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక నుంచి ఒకదాని తర్వాత మరొకటి అనే నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ విధానం సమయాభావంగా ఉంటుందని అలానే భూముల రికార్డులకు సంబంధించి చిక్కుముడులు ఉండవని అధికారులు చెప్తున్నారు.
మరింత సులువు చేసేందుకు: ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో భూములకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనంతరం రెవెన్యూ కార్యాలయాల ద్వారా మ్యుటేషన్, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్లు చేసే సమయంలోనే ఆటో మ్యుటేషన్ (రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే రెవెన్యూ రికార్డుల్లో నమోదు) ప్రక్రియకు శ్రీకారం చుట్టినా, సాఫీగా సాగలేదు. ఆన్‌లైన్‌లో నమోదు, పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాలకే వెళ్లాల్సి వచ్చేది. అయితే ప్రక్రియను మరింత సులువు చేయడంలో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారానే నోషనల్ సబ్ డివిజన్ సంఖ్యలను కేటాయించే విధానం ఇప్పటికే అమల్లో ఉందని అధికారులు చెప్తున్నారు.
విడతల వారీగా: ఒక గ్రామంలోని ఒకే సర్వే నంబర్‌లో ముగ్గురు వ్యక్తులు భాగాలుగా విభజించుకుని రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముగ్గురిలో మొదటి వ్యక్తికి నోషనల్ సబ్ డివిజన్ కేటాయించాక రెండవ వ్యక్తికి నోషనల్ నంబర్ ఇచ్చాక మూడవ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి సబ్ డివిజన్ నంబర్ కేటాయింపు జరిగి రిజిస్ట్రేషన్ పూర్తవ్వగానే ఆన్‌లైన్ అయిపోతుంది. గతంలో అయితే ముగ్గురు వ్యక్తుల రిజిస్ట్రేషన్లు ఒకే సారి పూర్తి చేసేవారు. వారంతా మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాక రెవెన్యూ కార్యాలయం నుంచి వేర్వేరు సబ్ డివిజన్‌లు లేదా అదే నంబర్‌లో ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ జరిగేది.
తాజాగా ఈ విధానంతో ముగ్గురు వ్యక్తులకూ అంతా సవ్యంగా ఉంటే ఒకే రోజులో లేకుంటే కొంత సమయం తర్వాత ఒక్కొక్కటిగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా రైతులు ఆన్‌లైన్‌లో నమోదు కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే రోజుల వ్యవధి ఉంటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయామోనని, పొరపాట్లకు తావుంటుందేమోనన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
అమల్లోకి వచ్చింది: ఒకే సర్వే నంబర్‌లో వేరువేరు వ్యక్తులకు విడతలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాజాగా అమల్లోకి వచ్చిందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ రిజిస్ట్రార్ నరసింహారావు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఆ మేరకు సర్వర్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. డాక్యుమెంటు రైటర్లకు విషయాలను తెలిపి, రైతులకు అవగాహన కల్పించమని చెబుతున్నామని అలానే ఆన్‌లైన్ ద్వారానే సబ్‌డివిజన్ జరిగి నంబర్లు కేటాయిస్తారని నరసింహారావు అన్నారు.
రేషన్‌కార్డుకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ - దోచుకుంటున్న దళారులు