Nellore YSRCP Leader Illegal Earnings and Irregularities : జగన్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేట్రేగిపోయిన నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన ఈ నేత అక్రమాలకు తెగబడి రూ.వందల కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. తన అనుచరులను ముందు పెట్టి గ్రావెల్, మట్టి, క్వార్ట్జ్, ఇతర ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ గుల్ల చేశారు. కొండలు పిండి చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని కబ్జా చేశారన్న అభియోగాలున్నాయి.
అప్పట్లో జిల్లాలో అధికార పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పిన నేత కావటంతో ఎన్ని ఫిర్యాదులందినా, బాధితులు ఘోషించినా చర్యలు కరవయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఆ వైఎస్సార్సీపీ నేత బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన అక్రమాలు, అరాచకాల గుట్టు బయటపెడుతున్నారు. వీటిలో కొన్నింటిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఒక్కోదానిలో తీగ లాగుతున్నకొద్దీ ఆ నాయకుడి అవినీతి, అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. కేసులకు భయపడే ప్రసక్తే లేదంటూ ఇటీవల వరకూ బీరాలు పలికిన ఆ నాయకుడు తన అక్రమాల చిట్టా బయటపడటం, పోలీసు బృందాలు గాలిస్తుండటంతో పరారీలోకి వెళ్లిపోయారు.
తహసీల్దార్ లాగిన్ ఐడీ కొట్టేసి ప్రభుత్వ భూమి కబ్జా
- వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రూ.60 కోట్లకు పైగా విలువైన 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా పేర్కొంటూ తన బినామీల పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని, దీని కోసం ఆయన ఓ తహసీల్దార్ లాగిన్, ఐడీని దొంగిలించారన్న ఆరోపణలున్నాయి. 2021 ఆగస్టులో దీనిపై కేసు నమోదైనా పోలీసులు ఈ నేత జోలికి వెళ్లలేదు. వెంకటాచలం మండలంలోనే రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ, దేవాదాయ భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
- నెల్లూరు గ్రామీణ మండలంలోని ఓ ఊరిలో దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు. అధికారులు సర్వే చేసి కబ్జా నిజమేనని తేల్చి, తిరిగి దళితులకు ఆ భూములిప్పించారు. అదే గ్రామంలో విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాల్ని ఈ నాయకుడు కబ్జా చేశారు. దీనిపై యజమానులు కేసు పెట్టారు.
- ఈ నేత అధికారంలో ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో తనకు అనుకూలమైన రెవెన్యూ అధికారుల్ని కీలక స్థానాల్లో నియమించుకున్నారు. వారి సాయంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువుల్ని ప్రైవేటు భూములుగా పేర్కొంటూ తన బినామీల పేరిట రికార్డుల్లో నమోదు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. పొదలకూరు మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తన బినామీల పరం చేయించారని, ఓ తహసీల్దార్‌ను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లు, భూ కబ్జాలు చేశారనే అభియోగాలున్నాయి. దీంతో ఆ తహసీల్దార్ అప్పట్లో సస్పెండయ్యారు.
- సర్వేపల్లి నియోజకవర్గంలో 3,300 ఎకరాల భూమి పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. సదరు వైఎస్సార్సీపీ నేత మాత్రం 7,200 ఎకరాలు పంచామని పదే పదే ప్రకటిస్తున్నారు. ఆ 3,900 ఎకరాల భూములు ఎవరి పరమయ్యాయో తేలాల్సి ఉంది.
రూ.కోట్ల విలువైన గ్రావెల్ దోపిడీ
వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో రూ.15 కోట్ల విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి, రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆయకట్టుకు నీరివ్వకుండా, పంటలు వేయనివ్వకుండా ఈ దందా నడిపించారు. రైతులు అడ్డుకున్నా, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
- నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్‌లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఈ గ్రావెల్ తవ్వకాల కోసం దరఖాస్తు చేశారు. దాన్ని అడ్డుపెట్టుకుని అనుమతికి మించి యథేచ్ఛగా తవ్వేశారు.
- పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్‌లో రూ.కోట్ల విలువైన క్వార్ట్జ్ కొల్లగొట్టారన్న అభియోగాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ అధికారుల ఫిర్యాదుతో దీనిపై ఇటీవల కేసు నమోదైంది. అందులో ఈ నాయకుడు కీలక నిందితుడు. విచారణకు రావాలని మూడుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా బేఖాతరు చేశారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండటంతో పరారయ్యారు.
- వైఎస్సార్సీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కొండల్ని కొల్లగొట్టి రూ.100 కోట్లకు పైగా విలువైన గ్రావెల్, మట్టి దోచుకున్నారన్న అభియోగాలున్నాయి. ఈ నాయకుడి ప్రధాన అనుచరులే గ్రావెల్ దందా నడిపించారు. పొదలకూరు మండలంలోని విరువూరు ఇసుక రీచ్‌లో అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున తవ్వేశారు.
అనధికారిక టోల్‌గేట్‌తో అక్రమ వసూళ్లు : కృష్ణపట్నం పోర్టు సమీపంలో ముత్తుకూరు- వెంకటాచలం మండలాల సరిహద్దుల్లో రోడ్డుపై అనధికారికంగా టోల్‌గేట్ పెట్టేశారు. కంటెయినర్లతో వెళ్లే భారీ వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడేవారు. వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో ఇలా రూ.కోట్లు దోచుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ముత్తుకూరు మండలంలోని థర్మల్ కేంద్రాల ద్వారా వచ్చే బూడిదను అధిక ధరలకు విక్రయించి, భారీగా సొమ్ము చేసుకున్నారు.
- 2014-19 మధ్య టీడీపీ హయాంలో డేగపూడి-బండేపల్లి కాలువ పనులు, చిట్టేపల్లి వద్ద రూ.4.5 కోట్లతో వద్ద భారీ శుద్ధ జల ప్లాంటు పనులు చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరు నేత ఆ కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం బెదిరించి, పనులు నిలిపివేయించారు.
- సర్వేపల్లి నియోజకవర్గంలోని పంటకాలువల్లో పూడికతీత, ఇతర పనులు చేయకుండానే బిల్లులు చేయించుకుని భారీగా డబ్బులు కొట్టేశారన్న ఫిర్యాదులున్నాయి. కనుపూరు కాలువ పనులు, చెల్లించిన బిల్లుల వివరాలివ్వాలని స.హ.చట్టం ద్వారా కోరినా అధికారులు ఇవ్వలేదు. రూ.50 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అంచనా.
మాజీ మంత్రి విడదల రజినిపై ఐపీసీ సెక్షన్ 386!
ఆ భవనం రాయల్ ప్యాలెస్ : ఈ నాయకుడు కరోనా సమయంలో విరాళాల పేరిట వసూలు చేసినవి, మద్యం అక్రమ విక్రయాల ద్వారా కూడగొట్టిన సొత్తుతో నెల్లూరులో ఓ భారీ భవనాన్ని నిర్మించారనే ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి ఖరీదైన వస్తువుల్ని తెప్పించి అందులో పెట్టారు. అందుకే ఆ ప్రాంత వాసులంతా దాన్ని ‘కరోనా భవనం’ అని, ‘రాయల్ ప్యాలెస్’ అని పిలుస్తుంటారు.
ఓట్ల కోసం కల్తీ మద్యం పంపిణీ : 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి తన నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేశారు. ఆ కల్తీ మద్యం తాగి అప్పట్లో కొందరు మరణించారు. ఈ కేసులో సదరు నాయకుడూ నిందితుడే.
- టీడీపీ నాయకుడు ఒకరికి విదేశాల్లో ఆస్తులు, అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయని ఆరోపిస్తూ సదరు వైఎస్సార్సీపీ నేత ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియాకు విడుదల చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతపై కేసు నమోదైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసుకు సంబంధించిన పత్రాల్ని నెల్లూరు కోర్టు నుంచి మాయం చేశారు.
ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా వేధింపులు : తోటపల్లి గూడూరు మండలం కోడూరుకు చెందిన బీసీ నేత వీరబోయిన గంగాధర్ మత్స్యకారపాళేనికి చెందిన భూములను లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తుండగా వాటిని అటవీ భూములని ముద్ర వేసి బలవంతంగా చెరువులు ధ్వంసం చేశారు. రూ.కోటి విలువైన రొయ్యలను సముద్రం పాల్జేశారు. దీనిపై బాధితుడు గంగాధర్ న్యాయపోరాటం చేశారు. అటవీశాఖ అధికారులు దోషులుగా హైకోర్టులో నిలబడి తప్పు అంగీకరించారు.
- వెంకటాచలం మండలానికి చెందిన కుంకాల దశరథ నాగేంద్రప్రసాద్‌ను సైతం తీవ్రంగా వేధించారు. ఆయన స్థలాల్లోని సెల్‌ఫోన్ టవర్లు, లారీ కాటాను ధ్వంసం చేయించారు.
- మత్స్యకార నాయకుడు ఆవుల మునిరత్నం, బీసీ నేత గుమ్మడి రాజాయాదవ్ తదితరులపై రౌడీషీట్లు ఓపెన్ చేయించారు.
దళితులకు వేధింపులు : పొదలకూరు మండలంలో ఓ వైఎస్సార్సీపీ నాయకుడు పనికి పిలిస్తే వెళ్లలేదని నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణపై దొంగతనం నిందలు వేసి పోలీస్‌స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి, చంపేశారు. అనంతరం అడవిలో ఉరేసుకున్నట్లు చిత్రీకరించారని, పోస్టుమార్టం చేసిన వైద్యాధికారులను కూడా బెదిరించి, ప్రలోభపెట్టి ఆత్మహత్య అని రాయించారని ఆరోపణలున్నాయి. ఆనవాళ్లు దొరక్కుండా పోలీసు బందోబస్తు మధ్య కుల సంప్రదాయాలకు విరుద్ధంగా మృతదేహాన్ని దహనం చేయించారు. ఇదంతా సదరు వైఎస్సార్సీపీ నేత ఆధ్వర్యంలోనే జరిగింది.
ఈ నాయకుడు రాష్ట్ర స్థాయి పదవిలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విజయవాడలోని ఆయన నివాసంలో ఓ ఏసీ టెక్నీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం అప్పట్లో సంచలనమైంది.
క్వారీ లాక్కుని రూ.100 కోట్లు దోపిడీ - ఎవరూ రాకుండా బౌన్సర్లతో కాపలా