Nearly 2Lakh Students Got Failed with One Mark : తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో కేవలం ఒక్క మార్కు తగ్గడంతో సుమారు 1.85 లక్షల మంది ఫెయిల్ అయ్యారని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి. కొందరు ఒక సబ్జెక్టులో, మరికొందరు రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని పెర్కొంది. గణితం-2బి ప్రశ్నాపత్రం కఠినంగా రావడంతో ఆశించిన మార్కులు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఫెయిల్ అయిన వారిలో కొందరు రివెరిఫికేషన్‌కు సిద్ధమవుతున్నారు.
ఇంటర్ తప్పిన వారి కోసం మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు నిన్ననే ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 30 వరకు ఆ పరీక్షలతో పాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. సప్లిమెంటరీలో పాసైతే రెగ్యులర్‌గా పాసైనట్లే పరిగణిస్తామని ఇంటర్ బోర్డ్ ఇప్పటికే తెలిపింది.
నిన్నటి ఫలితాల్లో కరీంనగర్‌లో చదివిన జక్కు అనన్య, పున్న అంజన బైపీసీలో రాష్ట్రంలోనే అత్యధికంగా 997 మార్కులు సాధించారు. అదే గ్రూపులో కుత్బుల్లాపూర్‌కు చెందిన అఫ్షన్ జెబీన్‌తో పాటు కేతావత్ అఖిల, దొంగిరి జ్యోత్స్నశ్రీ, జబీన్, వంటిపులి లాస్య 996 మార్కులు సాధించారు.
- ఇక ఎంపీసీలో ఇందూరి రష్మిత, వారణాసి మనస్వి, కూన రిత్విక్, పల్లెపంగు వసంత్‌కుమార్ 996 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మెరిశారు.
- ఎంఈసీ గ్రూపులో నలుగురు విద్యార్థినులు 990 మార్కులు సాధించారు.
- సీఈసీ గ్రూపులో అత్యధికంగా యేనుబారి కెవిన్ జోసెఫ్ 988 మార్కులు, హెచ్‌ఈసీలో గుండెబోయిన ధనప్రియకు 983 మార్కులు వచ్చాయి.
ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యార్థులు ప్రతిభచాటారు. మొత్తం 83.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 7,649 మంది ఏ గ్రేడ్ పొందారు. జూనియర్ ఇంటర్‌లో 78.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6,798 మంది ఏ గ్రేడ్ సాధించారు. 11 కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ సందర్భంగా విద్యార్థులను, సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
ఎస్టీ వెల్‌ఫేర్ విద్యార్థులు మొత్తం 6,541 మంది పరీక్షలకు హాజరుకాగా 5,536 మంది ఉత్తీర్ణత సాధించారు. 7 రెసిడెన్షియల్ కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. పరిగిలో కె.స్రవంతికి 994(ఎంపీసీ), దేవరకొండలో కె.అఖిల 996(బైపీసీ) మార్కులు వచ్చాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు మొత్తం 772 మంది పరీక్షలు రాయగా 691 మంది పాస్ అయ్యారు.