NDRF center in Amberpet PTC : ఎన్‌డీఆర్‌ఎఫ్(జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం) తాత్కాలిక కేంద్రం త్వరలో హైదరాబాద్ నగరంలో కొలువుదీరనుంది. 150 మంది రెస్క్యూ సిబ్బంది కోసం అంబర్‌పేట పోలీస్ శిక్షణ కళాశాల(పీటీసీ)లో వసతి సదుపాయాన్ని కల్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్‌లోగా ఆ దిశగా ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
రాష్ట్రవిభజన అనంతరం షేక్‌పేటలో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విపత్తుల సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టేందుకు ఉద్దేశించినటువంటి ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ విజయవాడ నగర సమీపంలోని గన్నవరం కేంద్రంగా కార్యకలాపాలు సాగించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మణికొండలోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచారు.
అరకొర వసతుల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే సిబ్బంది అక్కడినుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్‌లోని హమీదుల్లానగర్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ శిబిరం కోసం స్థలం కేటాయించారు. అక్కడ నిర్మాణాలు పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశముంది.
సుదూరం నుంచి రాకపోకలతో జాప్యం : రాష్ట్రంలో ఎప్పుడైనా సహాయక చర్యలు చేపట్టాల్సివచ్చినప్పుడు సుమారు 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ బెటాలియన్ నుంచి రెస్క్యూ బృందాలు రావాల్సివస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో గోల్డెన్ అవర్(మొదటి గంట)కీలకం కావడం, వారు వచ్చేందుకు 3, 4 గంటలకు పైగా సమయం పడుతుండటం వల్ల కొన్ని సందర్భాల్లో విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.
ఎస్డీఆర్ఎఫ్తో కలిసి సహాయక చర్యలు : మరోవైపు తెలంగాణ సర్కారు ఇటీవలే రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం(ఎస్‌డీఆర్‌ఎఫ్)ను అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ విభాగానికి తగిన ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారితో కలిసి సహాయక చర్యలు చేపట్టేందుకు 150 మందితో కూడిన 3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అవసరమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దుర్ఘటనపై గత నెల 24న జరిగిన సమీక్ష సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది.
3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు జూన్‌లోగా తాత్కాలిక సదుపాయాన్ని కల్పించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అంబర్‌పేట పీటీసీలో తాత్కాలిక వసతి కేంద్రం ఏర్పాటుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ 10 బెటాలియన్ కమాండెంట్ అంగీకరించారు.
తెలంగాణలో సరికొత్త దళం - విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం!
ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ - SDRF Funds to Telangana