Multi Talented Youngster Making Short Films In Eluru District: యువత ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లోనే కాదు. కళాత్మక రంగాల్లోనూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. సాంకేతిక యుగంలో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఆ కోవకు చెందిన యువకుడే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన నవీన్. సమాజహితం, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా లఘు చిత్రాలను రూపొందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అంతేనా ఆసక్తి, ప్రతిభ ఉన్న ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఓ వైపు వివిధ రకాల పనులు చేస్తూనే, మరోవైపు 24 క్రాఫ్ట్స్‌పై పట్టు సాధించాడీ యువకుడు. 2021లో సొంత ఊరిలోనే లఘు చిత్రాలు రూపొందించడం ప్రారంభించి అందరిలా కాకుండా తన సినిమాల ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేకూర్చడం, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించాడు. 10కి పైగా లఘు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించి రాష్ట్రస్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.
నేపథ్యం: కంప్యూటర్లో ఎడిటింగ్ చేస్తున్న ఈ యువకుడి పేరు నవీన్. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన రామకృష్ణబాబు, శ్యామల దంపతుల కుమారుడు. తండ్రి జానపద కళాకారుడు కావడంతో చిన్నతనం నుంచే కళారంగంలో ప్రతిభ కనబరిచాడు. సినీ రంగంలో రాణించాలనే కోరికతో హైదరాబాద్‌కు చేరుకుని చాలా ప్రయత్నాలు చేశాడు. చివరకు ప్రముఖ సంగీత దర్శకుడు శివశక్తి దత్త వద్ద సహాయ రచయితగా, దర్శకుడిగా సినీ, వెండితెర రంగాల్లో అడుగులు వేశాడు.
మెుదట తన స్నేహితులనే బృందంగా తయారు చేసుకుని ఆలోచింపజేసే విధంగా లఘు చిత్రాలను రూపొందించాడీ యువకుడు. పుట్టగానే ఉయ్యాల, చనిపోతే నలుగురు మెుయ్యాల, నడి మధ్యలో సమాజం కోసం ఎంతో కొంత చేయాలా అనే తన తండ్రి ఆశయాన్ని నినాదంగా చేసుకుని తన చిత్రాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే తపనతో పని చేశానని వివరించాడు.
"బీ ఏ హ్యూమన్" చిత్రానికి జాతీయ పురస్కారం: ఇటీవల గృహహింసపై తెరకెక్కించిన "బీ ఏ హ్యూమన్" అనే లఘు చిత్రానికి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నాడీ యువకుడు. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహిం చిన పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు 300 మంది పోటీల్లో పాల్గొన్నారు. వాటిలో నుంచి 7 చిత్రాలను కమిషన్ సభ్యులు ఎంపిక చేశారు. అందులో నవీన్ తీసిన లఘు చిత్రానికి మెుదటి పురస్కారం లభించింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి: తండ్రి స్ఫూర్తితో చదువుకునే వయసులోనే కూచిపూడి నేర్చుకోవడంతో పాటు సరిగమలు పలికించడంలోనూ పట్టు సాధించాడు నవీన్. దర్శకత్వం మాత్రమే కాకుండా తాను నిర్మించే లఘు చిత్రాలకు సొంతంగానే స్క్రిప్ట్ రాసుకోవడం, స్క్రీన్ ప్లే, సంగీతం, పాటలు రాయడం, పాడటం, ఎడిటంగ్ ఇలా పలు విభాగాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. సందేశాత్మక చిత్రాలతో పాటు వినోదం, కమర్షియల్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తానని వివరించాడు.
హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు: చిన్నతనం నుంచి కళారంగంపై మక్కువ ఉండటంతో తాము కూడా ప్రోత్సహించామని చెబుతున్నారు నవీన్ తండ్రి రామకృష్ణబాబు. సమాజంలో చైతన్యం తీసుకువచ్చే సందేశాత్మక చిత్రాలను తీస్తూ వాటితో ప్రజల్ని ఆలోచింపచేసేలా చేయడమే కాకుండా జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు తీసి సమాజహితానికి పాటుపడాలని కోరుకుంటున్నారు నవీన్ బృంద సభ్యులు.
ప్రతిదీ వ్యాపారాత్మక దృష్టితో చూసే ఈ రోజుల్లో డబ్బు కోసం కాకుండా సమాజహితానికి తోడ్పడేలా లఘు చిత్రాలు తీస్తూ వాటి ద్వారా ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు నవీన్ చేసే ప్రయత్నం హర్షణీయం.
"జాతీయ మానవ హక్కుల కమీషన్ వారు నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో "బీ ఏ హ్యూమన్" చిత్రానికి జాతీయ పురస్కారం రావడం నాకు ఎంతో సంతోషానిచ్చింది. చిన్నతనం నుంచి నాకు కళారంగంపై మక్కువ ఉంది. నా తల్లిదండ్రులు సైతం నన్ను ఎంతో ప్రోత్సహించారు. సందేశాత్మక చిత్రాలతో పాటు వినోదం, కమర్షియల్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తాను". -నవీన్, లఘు చిత్రాల దర్శకుడు
"మా అబ్బాయికి చిన్నతనం నుంచి కళారంగంపై మక్కువ ఉండటంతో మేము కూడా ప్రోత్సహించాం. సమాజంలో చైతన్యం తీసుకువచ్చే సందేశాత్మక చిత్రాలను మరిన్ని తీసి సమాజానికి తన వంతు పాత్ర వహిస్తాడని ఆశిస్తున్నాం. నవీన్ తీసిన "బీ ఏ హ్యూమన్" చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డు మాకు ఎంతో సంతోషంగా ఉంది". -రామకృష్ణబాబు, నవీన్ తండ్రి
అదరలేదు, బెదరలేదు - విజయం వైపు దూసుకుపోతున్న యువతి
అనారోగ్యం నుంచి రైతులకు రక్షణ - అందరి మన్ననలు పొందుతున్న శ్రీయ