Nandhini Siddha Reddy in Ravindrabharathi : రాష్ట్ర చిహ్నాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడివేస్తున్నారని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ రచయితల సంఘం (తెరసం) పదేళ్ల సాహిత్య సభలు రెండో రోజు నిర్వహించారు. 'తెలంగాణ అస్తిత్వ సాహిత్యం-వర్తమాన సందర్భం' అంశంపై సిధారెడ్డి మాట్లాడుతూ సర్వమతాల సహజీవనానికి గుర్తుగా ఉన్న కాకతీయ తోరణం, సామరస్యానికి ప్రతీక అయిన చార్మినార్, పాలపిట్ట, జమ్మి చెట్టే కాకుండా తెలంగాణ తల్లి చేతిలో రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మను కూడా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని తెలంగాణ సంస్కృతిపై దాడిగా పేర్కొన్నారు. తెలంగాణ తల్లిని ఉద్యమకాలంలో నిర్మించుకున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపుదిద్దుకున్నది కాదన్నారు. చిహ్నాల తొలగింపును, అభయహస్తం ముద్రలో ఉన్న తెలంగాణ తల్లిని తాము ఆహ్వానించడం లేదని స్పష్టం చేశారు. ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుని కనుమరుగై పోయి ఉద్యమ పోరాట పటిమను కోల్పోయిందని అన్నారు.
వ్యతిరేకించిన వారే మెల్లగా చేరారు: తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని, స్వరాష్ట్ర సాధనను వ్యతిరేకించిన వారే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వంలో చేరి చక్కగా అధికారాన్ని అనుభవించారని సిధారెడ్డి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ సంస్కృతి అంశంలో చర్చ జరిగినప్పుడు కవులంతా స్పందించారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన రాజకీయ పార్టీ కూడా ఆ తెలంగాణ చైతన్యాన్ని కోల్పోయిందని నిర్మోహమాటంగా తెలిపారు. భారత రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ చైతన్యాన్ని, సంస్కృతిని వదులుకుందని అన్నారు. ఈ మార్పులన్ని సంభవిస్తున్నపుడు కేవలం తెలంగాణ రచయితల సంఘం మాత్రమే ఈ గడ్డ చైతన్యాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో తెరసం అధ్యక్షుడు డా.నాళేశ్వరం శంకరం, సాహితీవేత్తలు పరాకుంశం వేణుగోపాలస్వామి, నిఖిలేశ్వర్, కవులు కందుకూరి శ్రీరాములు, డా.వి.శంకర్, ఘనపురం దేవేందర్, కొత్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.