Ration Card Names Issues In Telangana : పదేళ్ల తర్వాత తమ పేర్లు రేషన్ కార్డుల్లోకి ఎక్కుతున్నాయనే ఆశ వారికి నిరాశే మిగిల్చింది. ప్రభుత్వం తెలిపిన నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో, ప్రజాపాలన కార్యక్రమాల్లో కొత్త రేషన్ కార్డులు, ఉన్న ఆహార భద్రత కార్డుల్లోకి పేర్లు చేర్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రక్రియ పూర్తయిందని, తమ పేర్లు రేషన్ కార్డుల్లోకి చేరాయని ఆన్‌లైన్‌లో చూడగా నివ్వరపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌కు చెందిన బోయినపల్లి సామ్రాట్, బోయినపల్ల శ్రీయాన్ పేర్లు నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లిలో, బొల్లి విహాన్ పేరు ఆదిలాబాద్‌లో, బండలింగాపూర్‌లోని పలు పేర్లు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఉన్న అత్తగారి రేషన్ కార్డుల్లో చూపించాయి. బరుకుంట్ల విహాన్, వేదాంశ్‌ల పేర్లు బండలింగాపూర్‌లోని ప్రమోద్ అత్తగారి కార్డులో చేర్చారు. అయితే ఇలా పదుల సంఖ్యలో జరిగాయనే తెలుస్తోంది.
తమ కార్డుల్లో రావాల్సిన పేర్లు బంధువుల కార్డులో : ఆహార భద్రత కార్డుల్లో తమ కుటుంబసభ్యుల పేర్లు బంధువుల కుటుంబాల రేషన్ కార్డుల్లో చేరడంతో పలువురు పరేషాన్ అవుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న పలువురు భార్య, పిల్లల పేర్లతో కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో మీ సేవా కేంద్రాల్లో, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కొత్తగా పేర్లు చేర్చారని తెలియడంతో పలువురు మీ సేవ కేంద్రాలకు వెళ్లి రేషన్ కార్డులను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకొని చూసి షాక్ అయ్యారు. భార్య పిల్లల పేర్లు అత్తగారి ఆహార భద్రతా కార్డుల్లో చూపెట్టడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి త్వరగా పరిష్కరించాలి : ఇన్నేళ్లు రేషన్ కార్డుల్లో పేర్లు చేర్పుకు ఎదురు చూస్తే తీరా మళ్లీ అవస్థలు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వాటిని సరి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్‌ను ‘ఈటీవీ భారత్’ సంప్రదించగా, తాము దరఖాస్తులను పరిశీలించి డీఎస్‌వోకు పంపిస్తామన్నారు. సాంకేతిక లోపంతో అలా జరిగి ఉండవచ్చని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
తల్లిగారి కార్డులో పిల్లల పేర్లు : ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ఓ యువతికి ఎనిమిదేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా వాసితో వివాహమైంది. తల్లిగారి రేషన్ కార్డులోనే ఆమె పేరు ఉండిపోయింది. ఇటీవల ఆ యువతి, తన భర్త, పిల్లల పేరుతో కొత్త రేషన్‌కార్డు అప్లై చేశారు. ఆన్‌లైన్‌లో కొత్త కార్డు వచ్చిందా అని చెక్ చేయగా, కార్డు రాలేదు కానీ వారి పిల్ల పేర్లు మాత్రం సోన్ మండలంలోని ఆమె తల్లిదండ్రులు కార్డులో చేరాయి. ఏకంగా వారి పేర్లు జిల్లా దాటాయి. ఇలాంటి పరిస్థిత చాలామందికి వచ్చింది. పెళ్లి, ఉద్యోంగ రీత్యా పొరుగు జిల్లాల్లో స్థిరపడిన వారిలో చాలామంది ఈ తరహా సమస్యతో బాధపడుతున్నారు.
పిల్లలకే సపరేట్‌గా రేషన్ కార్డు : మరోవైపు పిల్లల పేర్లను పాత రేషన్ కార్డుల్లో జత చేయాలని దరఖాస్తు చేయగా ఏకంగా పిల్లలకే సపరేట్‌గా రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఇంకా వారికి రేషన్ కోటా కూడా మంజూరు అయ్యింది. దీంతో వారికి పంపిణీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. కొన్ని గ్రామాల్లో డీలర్లు పంపిణీ చేయగా, దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారుల చిన్నారులకు బియ్యం పంపిణీ చెయ్యొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలకు చెందిన రెండేళ్ల చిన్నారి ప్రసన్నకు కొత్త ఆహార భద్రత కార్డు ఇచ్చారు. మళ్లీ ఆ చిన్నారి తల్లిదండ్రులకు కార్డు లేదు. కుటుంబానికి మొత్తం కార్డు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా కేవలం చిన్నారికి మాత్రమే కార్డు వచ్చింది.
రేషన్ కార్డు దారులకు సూపర్ న్యూస్ - ఉగాదికి సన్నబియ్యం
రెండేళ్ల చిన్నారికి సెపరేట్‌గా రేషన్ కార్డు - తల్లిదండ్రులకు మాత్రం రాలేదు