Nagpur Experts on Gulzar House Fire Incident : గుల్జార్‌హౌజ్ చౌరస్తాలోని భవనంలో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఏసీ కంప్రెషర్లపై కెపాసిటీకి మించిన భారం పడటం వల్ల అవి పేలి ఉంటాయని తెలంగాణ అగ్నిమాపక శాఖ అంచనా వేసింది. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే ఆ ప్రాంతంలో మొత్తం విద్యుత్ సప్లై నిలిచేదని ఆ శాఖ అధికారులు విశ్లేషణ చేశారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కూడా కారణంగా ఉండోచ్చని మరో విషయం తెర మీదకు వచ్చింది. ఈ ప్రమాదంపై భిన్నవాదనలు వస్తుండగా ప్రభుత్వం వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు నాగ్‌పుర్ నుంచి నిపుణుల బృందాన్ని పిలవనుంది.
ఎల్టీమీటర్ వద్ద స్పార్క్‌తో ప్రమాదం : అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జీ+2 భవనంలో కింద మూడు వాణిజ్య పరమైన దుకాణాలు, పైరెండు అంతస్తుల్లో మొత్తం 8 గదులున్నాయి. ఇక్కడ ఏకంగా 14 వరకూ ఏసీలు ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. వాటికి హైగేజ్ కరెంటు తీగలు వాడారు. సామర్థ్యానికి మించిన విద్యుత్తును వినియోగించారు. ఆదివారం(మే18) తెల్లవారుజామున ఎల్టీ(లో టెన్షన్ కరెంట్ ట్రాన్సఫర్ మీటర్)మీటర్‌లో ఒక్కసారిగా స్పార్క్ రావటంతో మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే పాకుతూ ఏసీ కంప్రషర్స్‌కు చేరటంతో అవి పేలిపోయి తీవ్రమైన మంటలు చెలరేగడంతో, దట్టమైన పొగ అలుముకుంది.
అప్పటికే గాఢనిద్రలో ఉన్న 21 మంది కుటుంబ సభ్యులు దట్టంగా పొగ వ్యాపించడంతో తలుపులు మూసుకున్నారు. పొగ ఊపిరితిత్తుల్లోకి చేరటంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. సహాయక చర్యలు అందేలోపు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన 14 మందిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. ఇంట్లో లభించిన కొన్ని పత్రాలు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదు, ముత్యాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆ రోజు ఏం జరిగిందంటే : ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. 10 నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రహ్లాద్ మోదీ నడవలేక ఉన్న చోటనే అలాగే ఉండిపోయాడు. చిన్నకుమారుడు పంకజ్‌మోదీ తన భార్యతో కలిసి ఇంటి పై భాగంలోకి చేరినా ప్రాణాలతో బయట పడలేకపోయారు. ప్రహ్లాద్‌మోదీ భార్య మున్నీ భాయి వద్ద ఉన్న నలుగురు పిల్లలు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలారు. తండ్రి వద్దనే ఉన్న చిన్నకుమారుడు పంకజ్‌మోదీ భార్య, ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఇద్దరు కూతుళ్లతో సహా వారి ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
బాలల హక్కుల కమిషన్ సందర్శన : అగ్నిప్రమాదంలో పిల్లలతో పాటు పెద్దలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన భవనాన్ని ఆమె మంగళవారం సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.
14 ఏసీలు ఒకేసారి పేలాయా? అసలు ఆ నలుగురు ఎవరు - 'గుల్జార్‌హౌస్' ఘటనలో అసలేం జరిగింది?